Icds Notifications | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 23 : ఆరేళ్ళలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న ఖాళీల భర్తీపై అర్హుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటూ గతేడాది నుంచి పదే పదే ప్రకటించిన ప్రభుత్వం, సాంకేతిక కారణాల సాకుతో నియామక ప్రకటనలు వెలువరించటంలో జాస్యం చేస్తుంది. దీంతో, కేంద్రాల్లో చిన్నారుల అలనా.. పాలన చూసేందుకు ఒక్కరే దిక్కవుతున్నారు.
ప్రభుత్వ ప్రకటనతో ధరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమైన నిరుద్యోగ మహిళలు నోటిఫికేషన్ కోసం కళ్ళు కాయలు కాసేలా వేచిచూస్తూ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక ఆంగన్వాడీల్లో ఉద్యోగాల భర్తీ ఉత్తమాటేనంటూ నైరాశ్యం వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై టీచర్లు, ఆయాల పరీక్షలకు సిద్ధమైన మహిళల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. చిన్నారులకు ఆట, పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యనందించటం, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించటంతో పాటు అవసరమైన ఆరోగ్య సలహాలు ఈ కేంద్రాల నుంచే అందిస్తుంటారు. తల్లులు, పిల్లల సంరక్షణే ప్రధాన ధ్యేయంగా ఒక్కో కేంద్రానికి వచ్చే సంఖ్యను బట్టి టీచర్లు, ఆయాలను కేటాయిస్తారు.
అయితే, జిల్లాలో ఈ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నా వారికి సేవలందించేందుకు తగినట్లుగా సిబ్బందిని నియమించటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీలు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండటంతో క్షేత్రస్థాయిలో నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతున్నది. అసలే సొంత భవనాల్లేక అద్దె గదుల్లో అరకొర వసతులతో కునారిల్లుతున్న కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వెలువెత్తుతున్నది. జిల్లాలోని కరీంనగర్ అర్బన్, రూరల్, హుజరాబాద్, గంగాధర ప్రాజెక్టుల పరిధిలో 777 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక్కో కేంద్రానికి ఒక్కో టీచర్, ఒక్కో ఆయా విధులు నిర్వహించాల్సి ఉండగా, 700 మంది టీచర్లు, 577 మంది ఆయాలు మాత్రమే పని చేస్తున్నారు. మరో 20 కేంద్రాలు టీచరు, ఆయా లేకుండా పక్క కేంద్రాల నిర్వాహకుల చేతుల్లో కొనసాగుతున్నాయి.
కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని 172 సెంటర్లలో 24 కేంద్రాల్లో, రూరల్ పరిధిలో 202 కేంద్రాలకు గాను 60 సెంటర్లలో, హుజరాబాద్లో 244 కేంద్రాలు కొనసాగుతుంటే 73 సెంటర్లలో, గంగాధరలో 153 సెంటర్లుండగా 43 కేంద్రాల్లో ఆయాల పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఇటీవల ఉన్నతాధికారులకు పంపిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో 200 కేంద్రాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉండటంతో, ఈ ప్రభావం సేవలపై తీవ్రంగా పడుతోందనే అభిప్రాయాలు అంగన్ వాడీ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
నిత్యం సెంటర్లను శుచి, శుభ్రతతో ఉంచటం, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మధ్యాహ్నం పూట పోషకాహారం అందించే క్రమంలో భోజనం వండటం, చిన్నారులకు తినబెట్టడంతో పాటు వారి ఆలనా, పాలన చూడటం లాంటి ప్రధాన భాధ్యతలు ఆయాలే చూడాల్సి ఉంటుంది. అయితే, రెండేళ్ళుగా ఆయాల భర్తీ చేపట్టకపోవటంతో ఇద్దరి పనులు టీచర్లే చేయాల్సి రావటంతో, చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు సముచిత న్యాయం లభించటం లేదనే భావన టీచర్ల నుంచి వ్యక్తమవుతున్నది. నిత్యం పోషకాహారం అందుకునే వారి వివరాలు హాజరు పట్టికలో నమోదు చేస్తూ, పోషన్ అభియాన్ ట్రాకర్ యాప్ లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
రెండు పనులు ఒక్కరే చేయటం, వీటికితోడు పక్క కేంద్రాల నిర్వహణ కూడా అదనంగా చేపడుతుండటంతో ఆన్లైన్లో వివరాల నమోదులో జాప్యం కలుగుతుండగా, సకాలంలో పౌష్టికాహారం కేంద్రాలకు వచ్చే వారికి అందించలేకపోతున్నట్లు టీచర్లు పేర్కొంటున్నారు. ముగ్గురి పనులు ఒక్కరే చేయటం తలకు మించిన భారమవుతుండగా, తమ కుటుంబాలను పట్టించుకోలేని పరిస్థితులు తలెత్తుతున్నాయనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతోంది.
ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపాం : ఎం సరస్వతి, డీడబ్ల్యువో, కరీంనగర్
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న టీచర్లు, ఆయాల ఖాళీలు భర్తీ చేసేందుకు కొద్ది మాసాల క్రితమే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. సిబ్బంది కొరతతో కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాము. త్వరలోనే ఖాళీల భర్తీకి అవసరమైన నోటిఫీకేషన్ వెలువరించే అవకాశాలున్నట్లు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తోంది.