Eye Donetion | కోల్ సిటీ, జూన్ 28: మరణించినా.. ఆయన కళ్లు ఈ లోకంను చూస్తున్నాయి. గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి చింతకింది శ్రీహరి (80) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. మహిళ ఎస్.ఐ శారద కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు సమాజ హితం కోసం ఆలోచించి అతని నేత్రాలను దానం చేయడానికి మృతుడి భార్య అనసూర్య, కొడుకులు, కోడళ్లు శ్రీనివాస్ నీలిమ, అశోక్ – లావణ్య, కూతురు, అల్లుడు స్వరూప వేణుగోపాల్ అంగీకరించారు.
సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నిషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుడి నేత్రాలను సేకరించి హైదరాబాద్ కు తరలించారు. నేత్రదానం చేసిన కుటుంబీకులను గోదావరిఖని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యాంసుందర్, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్, సదాశయ ఫౌండేషన్ బాధ్యులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి తదితరులు అభినందించారు. శ్రీహరి మృతి పట్ల ప్రగాఢ సంతాపంను ప్రకటించారు.
మరణానంతరం నేత్రదానం చేయడం వల్ల మరో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపడంతో మానవ జన్మకు సార్ధకత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్ర, శరీర అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు.