Peddapally | పెద్దపల్లి, మే 30: సాధారణంగా యాసంగి సీజన్ సన్న రకం ధాన్యం పండించటానికి రైతులు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోసన్ క్వింటాలుకు రూ. 500 ప్రకటించటంతో.. పంట కాలం, పెట్టుబడి ఖర్చు ఎక్కువైన బోసన్ వస్తుందని ఆశతో రైతులు సన్న వడ్లు పండించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లు విక్రయించి రెండు నెలలైన బోసన్ రాలేదని, వెంటనే బోనస్ డబ్బులు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమానికి ఆహార్నిషలు కృషి చేస్తున్నామని, రైతు బరోసా ఇస్తున్నామని, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని సీఎం, మంత్రులు గొప్పలు చెప్పుతున్నారు. వానాకాలం సీజన్లో రైతు బరోసాకు పూర్తిగా ఎగనామం పెట్టి, యాసంగికి కొంత మంది రైతులకు ఇచ్చారు. ఇక బోసన్ విషయంలో వానాకాలం సీజన్ మాత్రమే ఇచ్చి,యాసంగి సీజన్‌కు ఎగ్గోట్టే ప్రయత్నం చేయటంతో సీఎం, మంత్రుల మాటలు నీటి మూటలేనా? అని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
73వేల ఎకరాల్లో సన్నాల సాగు..
పెద్దపల్లి జిల్లాలో నిరుడు యాసంగిలో 26 వేల ఎకరాల్లో సన్న రకం సాగు కాగా, బోసన్ వస్తుందనే ఆశతో ఈయేడు యాసంగిలో 73వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. దాదాపు 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారుల అంచనా వేశారు. ఇప్పటి వరకు దాదాపు 7లక్షల క్వింటాళ్ల సన్న ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
ఇంకా సుమారు 3 లక్షల క్వింటాళ్ల సన్న ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సేకరించిన సన్న ధాన్యానికి సంబంధించి రూ.35 కోట్లు బోనస్ కింద ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోలు చేసి రెండు నెలలైన బోనస్ రాలేదని, అసలు బోనస్ ఇస్తారో.. ఇవ్వరో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
బోనస్ వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న.. : మేకల మల్లేశ్, యువ రైతు, పెరకపల్లి, సల్తానాబాద్
గతంలో ఏ యేడు కూడా యాసంగిలో సన్న వడ్లు పండించలే. ప్రభుత్వం యాసంగి సీజన్లో సన్న వడ్లుకు బోనస్ ఇస్తామని చెప్పటంతో యాసంగిలో రెండున్నర ఎకరాల్లో సన్న వడ్లు పండించిన. 70 క్వింటాళ్లు అయినయ్. బోనస్ కింద రూ.35వేలు రావాలే. వడ్లు పోయి నెల రోజులైనా ఇంత వరకు బోనస్ పడలే. బోనస్ వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న.