జమ్మికుంట/జమ్మికుంట రూరల్, జనవరి 12: జమ్మికుంటలో గురువారం రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ రవీందర్రావు పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో ఆయనను మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తనుగుల, వావిలాల ఇసుక రీచ్‌ల నుంచి వందలాది లారీల ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వివరాలు ఈఎన్సీకి తెలిపారు. లారీల రవాణాతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని, పెద్ద లారీల ట్రాన్స్పోర్టేషన్కు ఈ రోడ్లు సరిపోవడం లేదని చెప్పారు. దుమ్ము, ధూళితో వాహనదారులు, పాదచారులు, పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. అంతేకాకుండా గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. వెంటనే స్పందించిన ఈఎన్సీ రవీందర్రావు కొత్తపల్లి-వావిలాల ప్రధాన రహదారి, ఇతర రోడ్లను పరిశీలించారు. అధ్వానమైన రోడ్ల పరిస్థితులపై ఈఎన్సీకి మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో పాలకవర్గం, తదితరులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వావిలాల వరకు రోడ్లను పరిశీలించేందుకు ఈఎన్సీ వెళ్లారు. ఆయన వెంట ఎస్ఈ చందర్‌సింగ్, ఈఈ సాంబశివరావు, డీఈ బాపురెడ్డి, ఏఈ ఉన్నారు.
స్పందించిన ప్రభుత్వం.. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు
తనుగుల, వావిలాల ఇసుక రీచ్‌లతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, భారీ లారీల సామర్థ్యాన్ని తట్టుకునే రోడ్లను వేయాలని గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు తెలిపారు. ఈఎన్సీకి వినతి పత్రం అందజేసిన తర్వాత చైర్మన్ మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిని స్పందించిన ప్రభుత్వం చీఫ్ ఇంజినీర్‌ను పంపించిందని, కొత్తపల్లి నుంచి వావిలాల వరకు రూ.18 కోట్లతో త్వరలో నూతన రోడ్డు వేసేందుకు ప్రణాళిక తయారైందని చెప్పారు. ముందుగా గుంతలుగా మారిన రోడ్లను బాగు చేస్తారని తెలిపారు. అందులో భాగంగానే ఈఎన్సీ ఇక్కడకు వచ్చారని, రోడ్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అధికారి నివేదిక పంపిన తర్వాత కొత్త రోడ్లు వేయిస్తారని తెలిపారు. ఇక్కడ పలువురు కౌన్సిలర్లు, ఎంపీపీ దొడ్డె మమత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు వసంత-రామస్వామి, పద్మ-సమ్మారావు, ఎంపీటీసీలు కవిత-లక్ష్మణ్, రాజయ్య, తనుగుల పీఏసీఎస్ చైర్మన్ అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.