Government schools | కోరుట్ల, మే 24: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాము పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన వృత్యాంతర శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు నూతన పోకడలను అవలంబిస్తూ విద్యార్థులకు బోధన చేయాలన్నారు. విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలని పేర్కొన్నారు.
మానవతా విలువలను, సామాజిక స్పృహ, పర్యా వరణ పరిరక్షణ, శారీరక, సామాజిక, ఆలోచన, భావ, ప్రవర్తన, మేథో వికాసం, విశ్వాసం, పెంపొందించేలా విద్యార్థులకు ఉన్నతమైన విద్యాబోధన అందించాలని తెలిపారు. పాఠశాల సమయ పాలన పాటించి, సమయాన్ని బోధనకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. విద్యార్థులకు ఒక స్నేహితునిగా, మార్గదర్శిగా ఉపాధ్యాయులు నిలువాలన్నారు. వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు.
పేరెంట్, టీచర్స్ సమావేశంలో విద్యార్థుల ప్రగతి పై, పాఠశాల అభివృద్ధి పై చర్చించాలని సూచనలు చేశారు. అనంతరం పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగవ స్థానంలో నిలవడంపై జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి గంగుల నరేశంను ప్రధానోపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, రావికంటి పవన్ కుమార్, జీవన్ రెడ్డి, రమాదేవి, నకుమల్ల నర్సయ్య, రణధీర్, సురేష్, అజయ్, మధుసూదన్ రావు, రిసోర్స్ పర్సన్లు రాజేష్, దామోదర్, చిరంజీవి, శ్రీనివాస్, శివ ప్రసాద్, మహేష్, శేఖర్, సీఆర్పీలు గంగాధర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.