సారంగాపూర్, నవంబర్14: ‘ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయి.. పోయినయి. ఎవరి పాలన ఎట్లా ఉండెనో మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండె.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడెట్ల మారిందో.. ఎంతలా అభివృద్ధి చెందిందో చూడండి. గతంలో పల్లెల్లో రైతు చనిపోతే రూపాయి ఇచ్చినోళ్లు ఉన్నరా..? రైతును కనీసం ఆదుకున్నోళ్లు ఉన్నరా.. పంట పెట్టుబడికి పైసలు ఇచ్చినోళ్లు ఉన్నరా.. ఎవ్వరూ ఇయ్యలే. పైగా రైతు జీవితాన్ని ఆగం చేసిన్రు. ఇంకా ముష్టి వేసినట్లు రూ.200 పింఛన్ ఇస్తుండె. అది ఎందుకైనా అక్కరకు వస్తుండెనా..?. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలను బాగుచేసుకున్నమని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ‘రైతు బీమా కింద కుటుంబాలు ఆగం కాకుండా రూ.5లక్షల బీమా ఇస్తున్నం. పెట్టుబడుల బాధ లేకుంటా ఎకరానికి రూ.10వేల రైతు బంధు ఇస్తున్నం. రూ.200 పింఛన్ ఆసరా పింఛన్‌ను రూ.2016 చేసుకున్నం. నేనొక్కటే చెబుతున్న ప్రతిపక్షాలను నమ్మితే మోసపోతం. మళ్లీ పాత కథే అయితది. ఒకసారి మీరందరూ ఇంటికి వెళ్లిన తర్వాత బాగా ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం పోతారం, బట్టపల్లి, సారంగాపూర్, నాయకపు గూడెం, మ్యాడారం తండా, భీంరెడ్డి గూడెం, రేచపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లో జగిత్యాల నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రాజేశం గౌడ్, స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడారు. ప్రజా సేవనే తన జీవిత లక్ష్యమని, ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని చెప్పారు. ‘నాడు కరెంట్ కోసం ఎంత ఇబ్బందులు పడ్డామో..? మీరు చూశారు. ఇచ్చే రెండు, మూడు గంటల కరెంటైనా సరిగ్గా లేక టాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండె. మోటర్లు కాలిపోతుండె. రిపేర్లు చేయించేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డమో..? మరిచిపోయారా..? ఇప్పుడు కాంగ్రెసోడు సాగుకు 3 గంటల కరెంటే ఇస్తా అంటున్నడు. మీ అవసరాలకు సరిపోతదా..? నేనొక్కటే అడుగుతున్నా..? సాగుకు 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? 3 గంటలే చాలు అంటున్న కాంగ్రెస్ కావాలో.. మీరే నిర్ణయం తీసుకోవాలని’ సూచించారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో జగిత్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఎంతో మార్పులు వచ్చాయన్నారు. నిరంతర ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి సాయం వల్ల పంటల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినట్లు చెప్పారు. పాత బస్టాండ్‌లో పాత సర్కార్ దవాఖాన ఉందని, దానికి ఐదింతలు పెద్దది కొత్త బస్టాండ్ సమీపంలో కొత్త దావఖానను నిర్మించుకున్నామని చెప్పారు.
ప్రతిపక్షాల చెప్పుడు మాటలు నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకే వారంటీ లేదని, వాళ్లు ఇచ్చే హామీలకు గ్యారంటీ ఉంటుందా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సంచనలమని, రైతు బీమా తరహా కేసీఆర్ బీమాతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఇంకా సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళలకు నెలకు రూ.3వేల భృతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన సిలిండర్‌ను రూ.400కే అందిస్తామని వివరించారు. ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, జగిత్యాల ఎన్నికల ఇన్‌ఛార్జి రాజేశం గౌడ్ ప్రజలను కోరారు. కాగా, ప్రచారం సందర్భంగా సంజయ్‌కుమార్‌కు ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్‌ఎంపీపీ సొల్లు సురేంధర్, ప్రజాప్రతినిధులు ఢిల్లీ రామారావు, అర్రె లక్ష్మి, జోగినిపెల్లి సుధాకర్ రావు, కొత్తురి రాజేశ్వరి, భుక్య అరుణ్ కుమార్, బుచ్చిమల్లు, ఎడమల జయ, భుక్య లావణ్య రాథోడ్, అజ్మిర శ్రీలత, పార్టీ అధ్యక్షులు గుర్రాల రాజేంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తోడేటి శేఖర్ గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు మదన్ కుమార్, జాగృతి మండలాధ్యక్షుడు మహేశ్ ఉన్నారు.