కూరగాయల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు గత యాసంగి వరకు ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెంటర్ నుంచి ప్రతి సీజన్లో రైతులకు మిరప, టమాటా నారు రాయితీపై అందించింది. అయితే ఈ సారి మొక్కలు అందిస్తారా..? లేదా..? అనేది సందేహంగా కనిపిస్తున్నది. స్పష్టత లేక రైతులు ప్రైవేట్ నర్సరీలను ఆశ్రయిస్తుండగా, అదనపు భారం పడుతున్నది. ముందు నుంచి ప్రణాళిక లేక పోవడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తుండగా, అధికారుల చోద్యం విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 2019లో సిద్దిపేట జిల్లా ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో పలు ఉద్యాన పంటలకు సంబంధించిన మొక్కలను పెంచి నారు రూపంలో రైతులకు రాయితీపై అందిస్తున్నది. నాలుగైదేళ్లుగా ఏటా ఉమ్మడి జిల్లాలో 150 ఎకరాలకు మీదనే టమాట, మిరప నారును రైతులకు అందించారు. జూన్, జూలైలో నార్లు పోసి 20 నుంచి 25 రోజుల్లో టమాట, 40 నుంచి 45 రోజుల్లో మిరప నారు రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో 25 నుంచి 35 ఎకరాల చొప్పున ప్రతి సీజన్లో 150 ఎకరాలకు ఈ కేంద్రం నుంచి నారు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సారి నారు పోసేందుకు ఆలస్యం కావడంతో గత నెల 14న ‘నమస్తే తెలంగాణ’ ఈ కేంద్రంపై ‘ఉద్యాన రైతులకు ఉత్త చేయి’ శీర్షికన కథనం ప్రచురించింది. అనేక మంది రైతులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ మొక్కలు పెంచడంలో ప్రభుత్వం ఉదాసీనతను బయటపెట్టింది. అప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కరీంనగర్‌కు 32.5 ఎకరాలు, జగిత్యాలకు 25, సిరిసిల్లకు 32, పెద్దపల్లికి 35 ఎకరాలు అవసరం ఉంటుందని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఇండెంట్ ఇచ్చారు.
మొక్కల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఇండెంట్ ఇచ్చిన అధికారులు రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే గతంలో ఈ సెంటర్ నుంచి రాయితీపై మొక్కలు పొందిన కొందరు రైతులు ఇంతకు ముందే నేరుగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లి విత్తనాలు ఇచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఇలాంటి రైతుల పేర్లను జిల్లా అధికారులు సిఫారసు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇలా విత్తనాలు ఇచ్చి వచ్చిన కొందరు రైతుల పేర్లను సిఫారసు చేయనట్టు తెలుస్తున్నది. ఈ సారి ఆలస్యం కావడంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి నారు ఇస్తారా..? లేదా..? అనే సందేహాలు తలెత్తాయి. దీంతో చాలా మంది రైతులు ప్రైవేట్ నర్సరీల్లో తమకు అవసరమైన నార్లు పోయించుకున్నారు. ఈ నేపథ్యంలో తమపై భారం పడుతున్నదని రైతులు వాపోతున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఎకరానికి సరిపడే నారుకు 8 వేలు ఖర్చయితే.. సబ్సిడీపై మిరపకు 1,280, టమాటాకు 1,500 తీసుకుని మొక్కలు పెంచి ఇచ్చేవారు. అయితే అధికారులకు ముందు నుంచి ప్రణాళిక లేక పోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. కూరగాయలు సాగు చేసే ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఔత్సాహికులైన రైతులకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మిరప, టమాటా నారు అందించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.