MLA on Wheels | తిమ్మాపూర్, జూన్17: ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరుతో పనిచేస్తున్న ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు కొత్తపల్లి మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రజలకు పనికొచ్చేవి చేస్తే మరింత మంచిదంటూ సూచించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ లో చేస్తున్న పనుల్లో పూర్తి సమాచారం తెలుసుకొని పనిచేస్తే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. ప్రజల సౌకర్యార్థం దారి బాగు చేస్తే మీకు కబ్జా లాగా కనిపిస్తున్నదని మండిపడ్డారు. గ్రామ అభివృద్ధి కోసం వంకరగా ఉన్న 18ఫీట్ల నక్ష తోవను, సరిగ్గా చేసి 30ఫీట్లుగా మార్చామని తెలిపారు. నక్షతోవకు కల్వర్టు అడ్డంగా ఉండేదనీ, దాన్ని కొంచెం పక్కకు జరిపి నేరుగా హైవేకి అనుసంధానం చేశామని చెప్పారు. ఇవేవీ తెలియని ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి, గ్రామానికి చెందిన మరోవ్యక్తి రోడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి సర్వేయర్ సమక్షంలోనే రోడ్డును అభివృద్ధి చేశామనీ, అందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు.
ప్రజలు కష్టపడి పనిచేసి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే వాటిని కూడా హరిస్తున్న ఎమ్మెల్యే పీఏను ఆయన ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నాడో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీకు మీ పీఏ అరాచకాల కారణంగానే మంత్రి పదవి రాలేదనీ, ఇప్పటికైనా అతన్ని దూరం పెడితే మీకే మంచిదని హితవు పలికారు. గ్రామస్తుల ఆశీర్వాదంతో మూడుసార్లు సర్పంచిగా పనిచేసిన తాను ప్రజల శ్రేయస్సుకు పాటుపడడమే తప్ప ఎవరికీ అన్యాయం చేసిందే లేదన్నారు. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరుతో ఓ తప్పుడు ఫిర్యాదు సృష్టించి, గ్రామాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లిని కోరారు.