ధర్మపురి, నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి క్షేత్రం దేదీప్యమానంగా వెలిగొందింది. బ్రహ్మపుష్కరిణి (కోనేరు) మెట్లపై భక్తులు వెలిగించిన పంచ సహస్ర (5వేల) దీపాలతో కోనేరు కాంతులీనింది. మెట్టుమెట్టుకూ వెలుగుతూ జ్వాలా తోరణమై ప్రకాశించింది.
బుధవారం రాత్రి దేవస్థాన పండితులు, అర్చకులు, సిబ్బంది మేళతాళాల మధ్య ఆలయం నుంచి కోనేరు వద్దకు చేరుకున్నారు. కోనేరు మధ్యలోని మండపంలో స్వామివారి చిత్రపటాన్ని ఉంచి, దీపం వెలిగించి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈవో సంకటాల శ్రీనివాస్, దేవస్థానం పాలకమండలి అద్యక్షుడు జక్కు రవీందర్ పాల్గొన్నారు.