KARIMNAGAR | కమాన్ చౌరస్తా, మార్చి 28 : ఇస్కాన్ కరీంనగర్ రాధా గోవిందుల బాలాలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా 31 మార్చి నుంచి ఏప్రిల్ 6 వరకు 7 రోజులపాటు ప్రతీ రోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:00 గంటల వరకు శ్రీమద్ రామాయణ ప్రవచనాలు నిర్వహిస్తున్నామని నరహరి దాస్ ప్రభు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు డిమార్ట్ పక్కనున్న ఇస్కాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డిజిటల్ యుగపు యువతలో జీవన విలువలు, భాద్యతలు, ఆరోగ్యకర జీవనశైలి, సత్ప్రవర్తన, సద్భావనలు కొరవడుతున్నాయని విచారం వ్యక్తం చేస్తూ శ్రీమద్ రామాయణ పాత్రలు మనకు జీవన ప్రయాణాన్ని మార్గదర్శనం చేస్తున్నాయని అన్నారు. నేటి పౌర సమాజం మన ఇతిహాసాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, ఈ సప్తాహం కూడా ప్రజల్లో చైతన్యం జాగృతం చేసేందుకు ఉపకరిస్తుందని నమ్మకంగా తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఈ సప్తాహంలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇస్కాన్ మందిర నిర్మాణానికి ప్రభుత్వం మూడెకరాల స్థలం కేటాయించడం శుభ పరిణామమని, దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో శ్రీ శ్రీ రాధా గోవిందుల మందిరం నిర్మితమవుతుందని తెలిపారు. కరీంనగర్ ఇస్కాన్ భక్త కమిటీ అధ్యక్షులు కన్న కృష్ణ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ పురవీధుల్లో వైభవోపేతంగా జగన్నాథ రథ యాత్రను నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు.
2024 మే మాసం నుంచి బాలాలయంలో భక్తులకు జగన్నాథుడి దర్శన భాగ్యం కలుగుతున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో రాధా గోవిందుల బాలాలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కొన్నేండ్లుగా శ్రీ నరహరి దాస్ ప్రభు జీ చొరవతో ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు భగవద్గీత ప్రవచనం నిర్వహిస్తున్నామన్నారు.
భక్తి గీతాలు, రామాయణ వేషధారణ, ప్రసాద వంటకాల పోటీల నిర్వహణ
కెప్టెన్ డా బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సప్తాహంలో భాగంగా ఏప్రిల్5న ఉదయం 10 గంటలకు రామాయణ మహాభారత ఆధారిత భక్తి గీతాలాపన పోటీలు ఇస్కాన్ బాలాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, అన్ని వయస్సుల వారు పాల్గొనాలని కోరారు. అదే విధంగా ఏప్రిల్6న సాయంత్రం స్వామి వారికి ప్రసాద వంటకాల పోటీతో పాటు రామాయణ పాత్రల వేషధారణ పోటీ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో అన్ని రకాల వయస్సుల భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్ రెడ్డి, పీ శ్రీహరి రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, గుండా రాధా కిషన్, ప్రేమానంద తదితర ఇస్కాన్ భక్త బృందం పాల్గొన్నారు. వివరాలకు 98494 45012 లేదా 94408 51408 నంబర్లను సంప్రదించాలని సూచించారు.