Kothagattu | మానకొండూరు : శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు శ్రీ మత్స్యగిరి స్వామి గుట్టపై బుధవారం తెల్లవారుజామున ఏర్పాటు చేసిన అగ్ని గుండాలపై నడిచి పలువురు భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుట్టపై ఉన్న శివాలయం ఆవరణలో అర్చకుడు గంగాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో అర్చనలు, అభిషేకాలు చేయించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక పుష్కరిణి సమీపంలో అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు.
తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర పుష్కరణలో పుణ్యస్నానాలు ఆచరించి కనకనలాడుతున్న నిప్పు కణికలపై హరహర మహాదేవ..! శంభో శంకర..!! అంటూ శివనామ స్మరణ చేస్తూ నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు వీరభద్రస్వామి ప్రస్తాయం, సుంకు పెట్టడం, వీర ఖడ్గాలు వేస్తూ హర హర మహాదేవ..,! శంభో శంకర..!! అంటూ అర్చకులు ఆవాహన చేశారు. అగ్నిగుండాలపై దాటితే శివుడు స్థిర చిత్తాన్ని ప్రసాదించి, వ్యాధులను తొలగిస్తాడని భక్తుల నమ్మకం. కార్యక్రమంలో ఆలయం చైర్మన్ మల్లారెడ్డి, ధర్మకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.