Lifetime Achievement Award | కోల్ సిటీ, జూన్ 12: గోదావరిఖనికి చెందిన సామాజిక వేత్త డాక్టర్ దేవి లక్ష్మీనర్సయ్యకు జీవన సాఫల్య పురస్కారం లభించింది. పసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖులు ఏనుగు నరసింహారెడ్డి, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు మధూకర్ వైద్యుల చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. కాగా, దేవి లక్ష్మీనర్సయ్య 1992 నుంచి ఇప్పటివరకు 69 సార్లు రక్తదానం చేశారు. ఇదివరకు పర్యావరణ వేత్తగా వృక్ష మిత్ర అవార్డు అందుకున్నారు.
యోగా వలంటీర్ గా , జేసీఐ ట్రైనర్ గా వేలాది మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే నిరుపేద విద్యార్థుల చదువు కోసం సాయం చేయడం, అభాగ్యుల ఆకలి తీర్చడం తదితర సామాజిక సేవలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థుల ఆత్మబలిదానాలు చూసి అప్పట్లో తన పోలీస్ ఉద్యోగానికే రాజీనామా చేశారు. అప్పటి నుంచి పూర్తి స్థాయి జీవితంను సమాజ సేవకే అంకితం చేశారు. ఆయన సేవలను గుర్తించిన వసుంధర విజ్ఞాన వికాస మండలి జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక స్వచ్ఛంద సంఘాల బాధ్యులు పలువురు ఆయనను అభినందించారు.