మాలతి ఇంజినీరింగ్ పూర్తి చేసి రూ. 5 లక్షల ప్యాకేజీతో ఓ ఎన్ఎంసీ కంపెనీలో జాబ్ కొట్టింది. రెండ్రోజుల్లో ఉద్యోగంలో చేరుతుందనే ఆనందంలో ఉన్న ఆ ఇంట అంతలోనే విషాదం నిండింది. అంతలోనే అనుకోనిరీతిలో తేలుకాటుతో ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. చెట్టంత బిడ్డ కండ్ల ముందే చనిపోవడం చూసి ఆ తల్లిదండ్రుల హృదయం తల్లడిల్లింది. కూతురు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 13: తేలు కాటుతో ఓ యువతి మృతిచెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో విషాదం నింపింది. రగుడు గ్రామానికి చెందిన బాలమల్లు-పద్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వీరిలో రెండో కూతురు మాలతి హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఇటీవలే సంవత్సరానికి రూ.5లక్షల ప్యాకేజీతో ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. రెండ్రోజుల్లో ఉద్యోగంలో చేరాలనుకున్న మాలతి కొద్ది రోజుల కుటుంబసభ్యులతో సరదాగా గడుపుదామనుకొని ఇటీవలే ఇంటికి వచ్చింది. ఆదివారం తండ్రి ప్యాంటు ధరించి వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వెళ్లింది. బెండకాయలు తెంపి ఇంటికి చేరుకునే క్రమంలో అప్పటికే ప్యాంటులో ఉన్న తేలు మాలతిని పలు చోట్ల కాటేసింది. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సేవల కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. అదేరోజు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్చించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. తండ్రి బాలమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనీల్‌కుమార్ తెలిపారు. కూతురు మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.