Karimnagar | శంకరపట్నం, ఏప్రిల్ 21: తను కోల్పోతున్న వ్యవసాయ బావికి పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతుపై దౌర్జన్యానికి దిగారు. పనులకు అడ్డుపడుతున్నాడని రైతును నానా బూతులు తిప్పి దాడి చేసి వ్యవసాయ బావిలోకి తోసి వేశారు. బాధిత రైతు శంకరపట్నం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాసు మచ్చయ్య కథనం ప్రకారం.. గ్రామ శివారులోని 17వ సర్వే నెంబర్లో తమకు వ్యవసాయ బావి ఉంది. జీవనాధారమైన వ్యవసాయ బావి ఎన్ హెచ్ఎఐ జాతీయ రహదారి 563 రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోతున్నాడు.
అందరికీ పరిహారం అందినా తనకు మాత్రం ప్రభుత్వం పరిహారం అందించలేదు. కాగా ఇటీవల రోడ్డు విస్తరణ పనులకు కాంట్రాక్టు దక్కించుకున్న డీబీఎల్ సంస్థ విస్తరణ పనులలో భాగంగా మచ్చయ్య బావిని కొంతవరకు పూడ్చివేశారు. అయితే తమ కోల్పోతున్న వ్యవసాయ బావికి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా తన బావిని పూడ్చవద్దని మచ్చయ్య అడ్డుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం డీబీఎల్ సిబ్బంది జేసీబీ తో బావిని పూడ్చివేయుటకు రాగా మచ్చయ్య పనులకు అడ్డుపడ్డాడు. అయితే డీబీఎల్ సంస్థ సైట్ ఇంజనీర్ నిరంజన్ అడ్డుగా నిలిచిన మచ్చయ్యను బూతులు తిడుతూ దాడి చేసి పక్కనే ఉన్న బావిలోకి నెట్టివేయగా బావిలో కొట్టి పడేసిన చెట్ల పొదలపై పడ్డాడు.
ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న మచ్చయ్య కొడుకు వెంటనే తండ్రిని తాడు సహాయంతో బయటకు లాగాడు. అనంతరం స్పృహ తప్పిన మచ్చయ్యను చికిత్స నిమిత్తం హుజురాబాద్ దవఖానకు తరలించారు. కాగా సాయంత్రం కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. సంఘటన స్థలానికి పోలీసు సిబ్బంది వెళ్లి విచారించారు. కాగా మచ్చయ్యకు సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ వల్ల ఆర్డీవో కార్యాలయ అధికారులు పరిహారం నిలిపివేశారని, సదరు రైతు తమ పనులకు అడ్డుపడుతూ, బూతులు తిడుతూ తనపై దాడికి యత్నించినట్లు సైటింగ్ ఇంజనీర్ కౌంటర్ పిటిషన్ ఇచ్చినట్లు ఎస్ హెచ్ ఓ సుధాకర్ వెల్లడించారు.