
Siricilla | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 3 : అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దళిత కౌన్సిలర్ కు మరోసారి అవమానం జరిగింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయిమణికంఠ గార్డెన్ లో గురువారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. స్థానిక 1వ వార్డు కౌన్సిలర్ బూర బాలమల్లు కార్యక్రమంలో పాల్గొని మొదటి వరుసలో కూర్చున్నారు. ప్రభుత్వ విప్, సిరిసిల్ల కలెక్టర్ కార్యక్రమం వేదిక పైకి రాగానే మొదటి వరుసలో కూర్చున్న కౌన్సిలర్ బూర బాలమల్లును వెనక వరుసలోకి వెళ్లాలని అధికారులు సూచించినట్లు ఆయన తెలిపారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని అయినందున ఉద్దేశ్య పూర్వకంగానే అధికారులు తనను మొదటి వరుస నుంచి వెళ్లిపోవాలని తాము సూచించిన చోటనే కూర్చోవాలని ఆదేశించారని బాలమల్లు వాపోయారు. గతంలోనూ తన వార్డు పరిధిలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలోనూ అధికారులు కనీసం కార్యక్రమానికి అహ్వానించకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానించారని అసహానం వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల పంపిణీ లో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఇప్పటికే హెచ్ఎర్సీలో ఫిర్యాదు చేశానని ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ సందర్భంలో మరోసారి అధికారులు తనకు చేసిన అవమానంపై హెచ్ఆర్సీని అశ్రయిస్తానని వెల్లడించారు.