MLA Dr. Kalvakuntla Sanjay | మెట్పల్లి, అక్టోబర్ 1 : మెట్పల్లి పట్టణంలోని కోర్టు కాంప్లెక్స్‌ను ఆనుకుని ఉన్న నీటి పారుదల శాఖకు చెందిన 33 గుంటల స్థలాన్ని కోర్టుకు కేటాయించి నూతనంగా మంజూరు దశలో ఉన్న అదనపు కోర్టు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం సహకరించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులు, న్యాయవాదులతో కలిసి కోర్టు కోసం ప్రతిపాదించిన 33 గుంటల స్థలాన్ని ఆయన గురువారం పరిశీలించారు. స్థలానికి సంబంధించి వివరాలు, కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన స్థలం తదితర అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు.
ఈ స్థలాన్ని కోర్టుకు అధికారికంగా కేటాయించడం వల్ల అదనపు కోర్టు భవన నిర్మాణాలకు, అదే విధంగా న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. గతంలోనే కోర్టు కోసం ప్రతిపాదించిన ఈ స్థలంలో తాజాగా నీటి పారుదలశాఖ డివిజన్ కార్యాలయం భవన నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని న్యాయవాదులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ డివిజన్ కార్యాలయానికి సంబంధించిన భవనాన్ని ప్రత్యామ్నాయంగా అనువైన స్థలంలో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదే విధంగా దీనిపై సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కలెక్టర్ తో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట నీటి పారుదలశాఖ మెట్పల్లి ఈఈ సురేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.