BRS leaders fire | మంథని, ఆగస్టు 22: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, బీఆర్ఎస్ సర్కారు హయాంలో సాగు నీటి కష్టాలంటే ఏంటో రైతులకు తెలియకుండా చేశారని, కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు స్వార్థ రాజకీయాలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మంథనిలోని రాజగృహలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సుపరిపాలన అందించారన్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో 10 ఏళ్ల పాటు రైతులను సాగు నీటి కష్టాలు, విద్యుత్ సమస్యలు లేకుండా చేశారన్నారు.
చెరువులు, కుంటల నిండా నీళ్లు ఉంచి ఖరీఫ్, యాసంగి సాగుకు నీళ్ల డోకా లేకుండా చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే అదే తెలంగాణను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కరువు ప్రాంతంగా మారుస్తున్నదన్నారు. రైతులకు సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక, యూరియా దోరకక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 నెలల పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మంథని నియోజకవర్గంలో మా నాయకుడు పుట్ట మధూకర్ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వామన్‌రావు దంపతుల హత్య కేసు కోర్టులో ఉందని, నిజనిర్థారణ కాక ముందే కాంగ్రెస్ నాయకులు హంతకుండు అంటూ సంబోధించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరుపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. మా నాయకుడు పుట్ట మధూకర్‌పై మరోసారి కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు, పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణ పాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, పుప్పాల తిరుపతి, కాయితీ సమ్మయ్య, ఆరెపల్లి కుమార్, పెగడ శ్రీనివాస్, గొబ్బూరి వంశీ, ఆసీఫ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.