Singareni | గోదావరిఖని : సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చిందించి సాధించిన బొగ్గును విక్రయించడం ద్వారా వచ్చిన నికర లాభాలను తక్షణమే ప్రకటించాలని, అందులో నుండి 36శాతం కార్మికుల వాటాగా చెల్లించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. గోదావరిఖని 2, 2A గనిపై జరిగిన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాస్తవ లాభాలపై వాటా చెల్లించిన వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల వాటా ప్రకటించిన దాంట్లో సగం మాత్రమే చెల్లించారని లెక్కలను వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో కార్మికులు సాధించిన బొగ్గు విక్రయం ద్వారా వచ్చిన డబ్బులలో 6 వేల కోట్ల రూపాయలను సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టామని చెప్పి, వాటి వివరాలు తెలియజేయకుండా అనేక అనుమానాలకు దారితీస్తున్నదని పేర్కొన్నారు.
మెడికల్ బోర్డు నిర్వహించకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. బొగ్గు గనులపై కార్మికులు ధరించే రక్షణ పరికరాలు బూట్లు, టోపీలు, చేతులకు తొడుక్కునే గ్లౌజులు కూడా లేవని ఆవేదన వ్యక్తపరిచారు. బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన డ్రిల్ బిట్లు, బిల్ రాడ్లు, పని స్థలాల రక్షణకు ఉపయోగించే రూఫ్ బోల్ట్ సామాగ్రి కూడా గనులలో లభించడం లేదని ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తికి, రక్షణకు అవసరమైన పరికరాలు లేకపోవడం వల్ల ఉత్పత్తి పడిపోతుందని, కార్మికుల రక్షణకు ముప్పు వాటిల్లిందని ఆయన ఆరోపించారు. లాభాల వాటా తేదీని తక్షణమే ప్రకటించకుంటే సింగరేణి కార్పొరేట్ కార్యాలయం తో పాటు ప్రజాభవన్ ను ముట్టడించడానికి వెనకాడేది లేదని హెచ్చరించారు. కార్మిక సంఘాలు ఇతరులను విమర్శించడం మానుకొని సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంఘటితంగా ముందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం గని మేనేజర్ కు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలోటీబీజీకేఎస్ జీడికే 2వ గని పిట్ సెక్రటరీ ఉప్పులేటి తిరుపతి, నాయకులు తొగరి నరేష్, పర్లపల్లి అభిషేక్, మధు, ప్రదీప్, రమేష్, కుమార్, ప్రవీణ్, యశ్వంత్,రవి, అనిల్, టిప్పు సుల్తాన్, శశి కుమార్, శ్రీకాంత్, వేణు భీమ్ రెడ్డి, శ్రీధర్, రాధాకృష్ణ, పాముకుంట్ల ప్రవీణ్, శివ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.