Koppula Eshwar | గోదావరిఖని : కేసీఆర్ ప్రభుత్వ హయంలో తీసుకువచ్చిన జీవో 76 ద్వారా సింగరేణి ప్రాంతాల్లో కొత్తగా పట్టాలు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలకు తెర లేపుతోందని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బొగ్గు గాని ప్రాంత ప్రజాప్రతినిధులు సింగరేణి ప్రాంతాల్లో నివసిస్తున్న కార్మికులకు పట్టాలు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తి మేరకు సింగరేణి సంస్థకు సంబంధించిన 2 వేల ఎకరాల స్థలాల్లో నివాసం ఉంటున్న సుమారు 30 వేల మందికి పట్టాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. జీవో 76 ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చాయని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో జీ వో తీసుకువచ్చి పట్టాలు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
76 జీవో ద్వారా కార్మికులకు న్యాయం జరగలేదని ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు వేసి న్యాయం చేస్తామంటూ మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలంలో సింగరేణి కార్మికులకు చేసిందేమీ లేదని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వారసత్వ ఉద్యోగాల ద్వారా 19500 మందికి ఉద్యోగాలు కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన నాలుగు మెడికల్ బోర్డు ద్వారా కేవలం 52 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించిందని ఇది చూస్తే కార్మికుల పట్ల వారికి ఎలాంటి శ్రద్ధ ఉందో అర్థం అవుతుందన్నారు. ప్రస్తుతం దాదాపు 2000 మంది మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ కోసం వేచి చూస్తున్నారని, అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతూ అన్ఫిట్ కాక అనేక అవస్థలు పడుతున్నారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని సింగరేణిలో గతంలో ఉద్యోగాలు పొందిన వారిపై విజిలెన్స్ విచారణ చేస్తామంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొనడం వారి చేతకానితనంగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
సింగరేణి సంస్థలు అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా వాటిని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంపై ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని మే 2023 తర్వాత సింగరేణిలో ఒక టెండర్ మినహా మిగిలిన అన్ని ఓబి టెండర్లు 8 శాతం నుంచి 20 శాతం వరకు పెంచి ఇచ్చారని డిటోనేటర్ల కుంభకోణంలో కోల్ ఇండియాతో పోలిస్తే 30శాతం అధికంగా రేట్లు పెంచి టెండర్లు కట్టబెట్టారని సోలార్ టెండర్లలో మెగావాటుకు రూ.ఐదు కోట్లు ఖర్చు చేశారని వాస్తవంగా ప్రైవేటు ఆధ్వర్యంలో 3.5 కోట్లకు మెగావాట్ కు ఖర్చవుతుందన్నారు. సింగరేణికి బొగ్గు అమ్మకాల ద్వారా రావాలసిన బకాయిలు రూ.60 వేల కోట్లకు పెరిగిపోయి సంస్థ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.6వేల కోట్ల బకాయిలు ఉన్న క్రమంలో ఇప్పుడు రూ.60 వేల కోట్లకు పెరగడం కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమేనని అన్నారు. గడిచిన మూడు సంవత్సరాల్లోనే దాదాపు రూ.33 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వాటిని చెల్లించకుంటే సింగరేణి సంస్థ అంధకారంలోకి వెళ్తుందన్నారు. ఈ సమావేశంలో మూల విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.