సీనియర్ సిటిజన్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. గుర్తింపు.. సంక్షేమాన్ని విస్మరిస్తున్నది. వృద్ధుల మేలు కోసం అందజేసే గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను ఏడాదిగా నిలిపివేయగా, దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 13: వయసు ధ్రువీకరణ, పలు ప్రభుత్వ సంక్షేమ సేవలు పొందేందుకు వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులను 2006 నుంచి అందజేస్తున్నారు. 2023 వరకు నిరంతరాయంగా కొనసాగిన కార్డుల జారీ ప్రక్రియ, ఆ తర్వాత కాలంలో తగ్గిపోతూ వచ్చింది.
ఏడాది కాలంగా పూర్తిగానే నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లాలో సుమారు 15వేల మందికిపైగా రిటైర్ అయిన వారు ఉండగా.. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న 51,084 మందికి కార్డులు అందజేయాల్సి ఉన్నది. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, అర్జీలు స్వీకరిస్తున్నా కార్డులు ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పకపోతుండడంతో దరఖాస్తుదారులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
ఈ కార్డులు ఉన్నవారికి రైల్వే ప్రయాణాలు, ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కేటాయింపు, విమాన ప్రయాణాల్లో రాయితీలు, న్యాయస్థానాల్లో తగు ప్రాధాన్యత కలిగేది. పలు సంక్షేమ పథకాలు లబ్ధిపొందేందుకు దేవాలయాల్లో దర్శనాల సమయంలో కార్డులు ఉపయుక్తంగా ఉండేవి. కానీ, ఏడాదిగా ఇవ్వకపోవడంపై సీనియర్ సిటిజన్లంతా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు విశ్రాంత ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాలు పెండింగ్లో ఉంచడం, ఇంకోవైపు స్పౌజ్ కేటగిరీలో మాత్రమే వృద్ధాప్య పెన్షన్లు మంజూరీ చేస్తూ, మిగతా వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. వృద్ధుల సమస్యలు ఒక్కొక్కటిగా పేరుకుపోతుండగా, జీవిత చరమాంకంలో వీధుల్లోకొచ్చి ప్రభుత్వంపై పోరాటం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన చెందుతున్నారు.
సీనియర్ సిటిజన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వాదేశాల మేరకే నిలిపేశాం. గతంలో వృద్ధులు వీటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోగా, కొద్ది నెలల నుంచి దరఖాస్తులు బాగా వస్తున్నాయి. వీరికి కార్డులు జారీ చేయడంపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలుపగా, నిలిపివేయాలని సూచించారు. అప్పటి నుంచి జారీ చేయడం లేదు.
– సరస్వతి, డీడబ్ల్యూవో (కరీంనగర్)