గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ సర్పంచులు తాము చేసిన పనులకు రావాల్సిన బిల్లుల కోసం అల్లాడుతున్నారు. అప్పులు చేసి అభివృద్ధి చేశామని, పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు రాలేదని వాపోతున్నారు. చేసిన అప్పులు చెల్లించేందుకు ఆస్తులు సైతం అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు మాట మార్చి, తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులు కావని బుకాయిస్తుండడంపై మండిపడుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ సర్పంచులు ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తమ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. బిల్లులు చెల్లించనిదే ఎన్నికలు జరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు.
కరీంనగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : గ్రామాల అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేసిన స ర్పంచులు, తమ పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికీ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపాలు, విజ్ఞప్తులు, అప్పుడప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడా పనులు తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని బుకాయిస్తున్నారని మాజీ సర్పంచులు వాపోతున్నారు.
ఈ మాట ఎన్నికలకు ముందు ఎందుకు అనలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఒక్కో గ్రామంలో లక్షల్లోనే పెండింగ్ బిల్లులు ఉన్నాయని, మైనర్ పంచాయతీల్లో కనీసంగా 4 లక్షల నుంచి 6 లక్షల వరకు, మేజర్ పంచాయతీల్లో 30 లక్షల నుంచి 40 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని, కొన్ని పెద్ద పంచాయతీల్లో అయితే 60 లక్షల నుంచి 70 లక్షలకు మించి బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తంలో 1,200 కోట్లు రావాల్సి ఉండగా, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 118 కోట్ల వరకు వివిధ పద్దుల్లో పెండింగ్ బిల్లులు ఉన్నట్టు మాజీ సర్పంచులు వాపోతున్నారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు ప్రాతినిధ్యం వహించిన మాజీ సర్పంచుల పరిస్థితి మరీ దారుణంగా మారిందని వాపోతున్నారు. పంచాయతీలుగా ఉన్నా తమ పెండింగ్ బిల్లులు వచ్చేవని, ఇప్పుడు మున్సిపల్ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకోవడంతో శాఖలు మారి ఇబ్బందులు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీలకు బకాయి పడిన పద్దులన్నీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) పద్దుల కిందనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయలేదు. సీసీ రోడ్లు, మురుగు కాలువ లు, పంచాయతీ భవనాలు, ఇతర శాశ్వత అభివృద్ధి పనులన్నీ ఈ పద్దుల కిందనే అప్పటి సర్పంచులు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడు 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా వచ్చేవి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయగా కొన్ని నిధులు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని మాజీ సర్పంచులు తప్పుపడుతున్నారు.
ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసుకునేందుకు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2,100 చెక్కులు వివిధ ట్రెజరీ కార్యాలయా ల్లో పెండింగ్లో ఉన్నట్లు సర్పంచులు వి వరిస్తున్నారు. 2 లక్షల నుంచి 3 లక్షల బిల్లులకు సంబంధించి కొన్ని చెక్కులు మాత్రమే క్లియర్ అయినట్టు తెలుస్తున్నది. సకాలంలో ఎన్నికలు లేక పోవడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు. ఈ భారం ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపైనా పడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో మాజీ సర్పంచుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చాలా మంది మాజీ సర్పంచులు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని వారు వాపోతున్నారు. వడ్డీలు కట్ట లేక తమ కు టుంబాలపైనా ప్రభావం చూపుతున్నదని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోగా, చాలా మంది ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలు ఉన్నా యి. కొందరు మాజీ సర్పంచులు తమ ఆస్తులు అమ్మి అప్పులు కట్టుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సన్నీళ్ల వెంకటేశం నెల కింద తనకున్న 30 గుంటల భూమిని అమ్మితే వచ్చిన డబ్బులతో 22 లక్షల అప్పు చెల్లించాడు. ఇంకా 11 లక్షల అప్పు ఉందని ఆయన వాపోయాడు.
ఇదే మండలంలోని ముదిమాణిక్యం సర్పంచ్ జక్కుల రవి చేసిన అప్పులు తీర్చలేక భార్యతో కలిసి కూలీ పనులకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇక కరీంనగర్ శివారులోని చింతకుంట గ్రామానికి చెందిన గిరిజన మహిళా సర్పంచు మొగిలి మంజుల సమ్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ గ్రామం నగర పాలక సంస్థలో విలీనమైంది. మంజుల చేసిన పనులు ఎంబీ రికార్డుల ప్రకారంగా 60 లక్షలు, వోచర్ల ద్వారా జరిపిన చెల్లింపులు మరో 15 లక్షల వరకు రావాల్సి ఉంది. మున్సిపాలిటీలో తమ గ్రామం విలీనమైతే తమ పరిస్థితి ఏంటని ఈ సర్పంచ్ దంపతులు వాపోతున్నారు. ఇలా ప్రతి ఒక్క మాజీ సర్పంచు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఇన్నాళ్లూ విజ్ఞప్తులు, విన్నపాలు చేసిన మాజీ సర్పంచులు ఇప్పుడు ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తమ బిల్లులు చెల్లించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.
ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనలు చేస్తూనే న్యాయపరంగా సైతం పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన నిరసనలు, ఆందోళనలను పోలీసులచే అణచివేసిన ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యక్ష పోరాటం చేస్తే గానీ, ప్రభుత్వం దిగిరాదనే భావన మాజీ సర్పంచుల్లో కనిపిస్తున్నది. అందుకు అనుగుణంగానే తమ పోరాటం ఉంటుందని కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం అలియాస్ సాగర్ స్పష్టం చేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని ఇప్పుడు వక్రీకరిస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని, బిల్లులు తాము చె ల్లించలేమని బుకాయిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపుగా మేం భావించాల్సి వస్తున్నది. పార్టీలకతీతంగా గెలిచి నిస్వార్థంగా సేవలందించిన మాకు రాజకీయాలతో సంబంధాలు ఉండవు. రాజకీయ రంగు పులిమి బిల్లులు చెల్లించకుండా తప్పించుకోవాలనే ప్రయత్నంలో ప్రభుత్వం కనిపిస్తోంది. మా బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనే ఏకైక నినాదంతో ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడుతాం..
సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు అప్పులు చేసి అభివృద్ధి చేసిన. ఇప్పుడు అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్న. బిల్లులు వస్తేనే అప్పులు తీరుత యి. సర్పంచుగా ఉండి ఒక్క రూపాయి సంపాయించ లేదంటే ఎవ్వరు నమ్ముత లేరు. ఆఖరికి ఇల్లు గడవక నేను, నా భార్య ఉపాధి హామీ పనికి పోతున్నం. నాలాగే చాలా మంది సర్పంచులు ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నరు. పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఆందోళన బాట పట్టక తప్పదు. మా బిల్లులు చెల్లించకుంటే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతది. వచ్చే ఎన్నికల్లో సర్పంచులుగా నిలబడేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు.
– జక్కుల రవి, మాజీ సర్పంచ్, ముదిమాణిక్యం (చిగురుమామిడి మండలం)
మాది చింతకుంట. ఇప్పుడు మా గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేసిన్రు. మాకు అన్నీ కలిపి 75 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలో గెలిచిన రెండో ఎస్టీ మహిళను. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం మాకు పెద్ద శిక్ష వేసింది. మా బిల్లులు రాకుంటే అడుక్కుతినే పరిస్థితి మాది. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్లు మా పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నరు. శాఖ కూడా మారిపోయింది. మా పెండింగ్ బిల్లులు ఎట్లస్తయని రోజు రోజుకూ ఆందోళన ఎక్కువైతంది. దయచేసి మా బిల్లులు చెల్లించాలని వేడుకుంటున్నం.
-మొగిలి మంజుల సమ్మయ్య, మాజీ సర్పంచ్, చింతకుంట (కొత్తపల్లి మండలం)
మాది చిన్న పంచాయతీ. మంచిగ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పనినీ చేసిన. సుమారు 70 లక్షలు వెచ్చించి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసిన. అన్ని ఊళ్లకంటే మా ఊరు గొప్పగా ఉండాలని భావించిన. ఎక్కడా రాజీ పడకుండా అప్పులు తెచ్చి పైసలు పెట్టిన. అప్పు ఇచ్చినోళ్లు ఇజ్జత్ తీసిన్రు. నెల కింద 30 గుంటల భూమి అమ్మిన. కొన్ని అప్పులు కట్టిన. ఇంకా 11 లక్షల అప్పున్నది. బిల్లులు రాకుంటే ఇప్పుడు అమ్మడానికి ఇంకేమీ లేదు. ఇంత ఇసం తప్ప. మేం ఏం పాపం చేసినమని మా బిల్లులు ఇస్త లేరు. రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలె. ఎన్నికలకు ముందే మా బిల్లులు చెల్లించాలె..