విద్యానగర్, మే 15 : రైతులకు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగు మందులు, నిషేధిత బీటీ-3 (హెచ్టీకాటన్) పత్తి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం కరీంనగర్‌లోని గాంధీరోడ్‌లో గల తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో జిల్లాలోని అన్ని వ్యవసాయ డీలర్ల(విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు)కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ, డీలర్లు రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ పీవోఎస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేయాలన్నారు.
గ్రౌండ్ స్టాక్ ఎరువుల నిల్వలు, పీవోఎస్ మిషన్‌లోని నిల్వలతో తప్పక సరిపోలాలని సూచించారు. మండల వ్యవసాయాధికారులు పక్షం, నెల రోజులకొకసారి ఎరువుల విక్రయ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆడిట్ చేయాలని ఆదేశించారు. రాబోయే సీజన్లో డీలర్లందరూ కల్తీ లేని ఆరోగ్యకరమైన వ్యాపారం చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. సదస్సులో డీలర్లతో పాటు మండల వ్యవసాయాధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, మార్క్‌ఫెడ్ మేనేజర్, సహకార అధికారులు పాల్గొన్నారు.