కలెక్టరేట్, ఫిబ్రవరి 23: మీ-సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఓటరు జాబితా, పెండింగ్ కోర్టు కేసులు, మీ-సేవ అప్లికేషన్స్, ప్రభుత్వ భూములపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓటు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఓటు హక్కు తొలగింపుపై సమాచారం ఉండాలని, జాబితాను మరోసారి చెక్ చూసుకోవాలని సూచించారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచవద్దని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ నమోదుపై ఆరా తీశారు. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూముల వివరాలు పక్కాగా, సర్వే నంబర్లతో సహా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, పూజారి గౌతమి, ఆర్డీవో ఆనంద్‌కుమార్, డీఈవో రమేశ్‌కుమార్, టెక్స్టైల్ ఏడీ సాగర్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.