గోదావరిఖని, సెప్టెంబర్ 11: దేశం మెచ్చిన మహా నేత సీఎం కేసీఆర్ అని, దేశ ప్రజలు, నాయకులంతా ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మధు, నారాయణ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్‌కు చెందిన 200 మంది మహిళలు, 50 మంది యువకులు టీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రామగుండానికి మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు కూడా ప్రారంభించేలా చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. కరోనా సమయంలో తానే స్వయంగా 1300 మంది కుటుంబాలకు ఇంటికి వెళ్లి సాయం అందించానని, రామగుండం ప్రజల సేవకే తన జీవితం అంకితమని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఏదైనా కష్టం వస్తే చూస్తూ ఊరుకునే మనస్తత్వం తనది కాదన్నారు. కార్యక్రమంలో మేయర్ అనిల్‌కుమార్, టీబీజీకేఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య, కార్పొరేటర్లు రాకం లతావేణు, నాయకులు బొడ్డు రవీందర్, పర్లపల్లి రవి, నీరటి శ్రీనివాస్, జాహిద్ పాషా, సంజీవ్, జేవీ రాజు, ఫయాజ్ అలీ, ఓదెలు, శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రజాభిప్రాయ సేకరణ
పాలకుర్తి, సెప్టెంబర్11: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదివారం పాలకుర్తిలో రోడ్డు పక్కన హోటల్లో టీ తాగుతూ కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై స్థానికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నాడు పీవీ నర్సింహారావు, నేడు కేసీఆర్ బహుభాషాకోవిదులు, మేధావులని, ఇలాంటి వారితోనే దేశం ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు.