Siricilla | సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 3: ఇందిరా మహిళా శక్తి చీరలతో పాటు అన్ని రకాల క్లాత్ ఆర్డర్లు మ్యాక్స్ సంఘాలకు సమానంగా కేటాయించాలని జిల్లా పవర్ లూం మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిమ్మని ప్రకాష్ కోరారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ ఏడీని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి చీరల క్లాత్ ఆర్డర్లు ఈ నెల 2 న కొన్ని మ్యాక్స్ సంఘాలకు ఎక్కువ, మరిన్ని సంఘాలకు తక్కవగా ఇచ్చారని అన్నారు.
దీని కారణంగా చిన్న తరహా సంఘాల సభ్యులు, కార్మికులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వాపోయారు. గతంలో చిన్నచిన్న క్లాత్ ఆర్డర్ల రోటోగ్రే ఆర్డర్, రంజాన్, క్రిస్టమస్, సర్వశిక్ష డిపార్ట్మెంట్ ఆర్డర్లను ఏ విధంగా కేటాయించారో అదే తరహాలో అన్ని సంఘాలకు సమానమైన ఆర్టర్ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీముని రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.