కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గెలుపుపై ఆయా పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగిన తీరు.. పెరిగిన పోలింగ్ శాతం నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోపల మాత్రం అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మిన నాయకులు తమ విజయం కోసం పనిచేశారా..? లేక నమ్మించి కోవర్టుల్లా మారారా..? అన్న మీమాంసలోనూ కొంతమంది కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా చూస్తే గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థుల మధ్యే పోటీ కనిపిస్తుండగా.. టీచర్ ఎమ్మెల్సీ విషయంలో మాత్రం రిజల్ట్ దాదాపు క్లియర్కట్గానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కౌటింగ్లో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకు వస్తే మాత్రం చాలా మంది అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలున్నాయి. అయినా అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే శ్రేణులతో లెక్కల్లో మునిగి తేలుతుండగా, ఎల్లుండి సాయంత్రం వరకు ఉత్కంఠ వీడనున్నది.
MLC Elections | కరీంనగర్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఇక కౌంటింగే మిగిలింది. సోమవారం ఫలితాలు వెల్లడి కానుండగా, గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్‌శాతం పెరిగింది. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి విజయం చేకూర్చుతుందన్న చర్చ ప్రస్తుతం అన్ని వర్గాల్లో నడుస్తున్నది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలపై కొంత క్లియర్ కట్‌గానే సమాచారం వస్తుండగా.. పట్టభద్రుల విషయంలో మాత్రం అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ కనిపిస్తున్నది. గ్రాడ్యుయేట్స్‌కు సంబంధించి మొత్తం 3,55,159 మంది ఓటర్లు ఉండగా… అందులో 2,50,106 మంది (70.42శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 1,05,053 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. నిజానికి ఈసారి ఓటర్ల నమోదు విషయంపై బరిలో నిచిలిన అభ్యర్థుల్లో చాలా మంది దృష్టిపెట్టారు.
ఫలితంగా భారీగా ఎన్రోల్మెంట్ జరిగింది. అయితే ప్రస్తుతం జరిగిన పోలింగ్ ప్రకారం చూస్తే యాభైశాతం దాటి అంటే 1,25,053పైగా ఓట్లు వస్తే ముందుగానే సదరు అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ, పట్టభద్రుల విషయంలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే మాత్రం బరిలో ఉన్న ఏ అభ్యర్థికి కూడా ముందుగానే ఇన్ని ఓట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో ప్రాధాన్యతకు వెళ్లాల్సి వస్తే ముందుగా అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి వద్ద నుంచి ఎలిమినేట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించాల్సి వస్తే చాలా మంది అంచనాలు తారుమారయ్యే అవకాశమున్నది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ కనిపిస్తున్నది.
అందులో బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్‌రెడ్డి మధ్యే గెలుపోటములు ఉంటాయన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ఈ ముగ్గురిలోనూ ఏ ఒక్కరికీ మొదటి దఫాలోనే యాభైశాతానికి మించి వచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యతకు వెళ్తే అక్కడ ఎవరి తలరాతలు తారుమారు అవుతాయో అన్న చర్చ ప్రస్తుతం ఆయా వర్గాల్లో నడుస్తున్నది. ఈనేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓటు తనకంటే.. తనకు వచ్చిందంటూ అభ్యర్థులు అంచనాలు వేసుకుంటూ ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఫలితాలు కొంత క్లియర్కట్గానే కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ సరళిని చూస్తే పీఆర్టీయూ నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేసిన కొమురయ్య మధ్యే గెలుపోటములుంటాయన్న అభిప్రాయాలున్నాయి. అందులోనూ ఈసారి పార్టీ అభ్యర్థే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. పీఆర్టీయూ యూనియన్‌కు ఉన్న సభ్యత్వం, ఆ యూనియన్ శ్రేణులు మనసు పెట్టి పనిచేసి ఉంటే… లేదా ఆ సంఘంలోని ప్రతి ఒక్కరూ పీఆర్టీయూ మహేందర్‌రెడ్డికి ఓటు వేసి ఉంటే గెలుపోటములు తారుమారు కూడా కావచ్చన్న చర్చ కూడా నడుస్తున్నది.
ఓటువేశారా.. నటించారా..?
ఇన్నాళ్లూ తమ వెంటే ఉంటూ ప్రచారం చేసిన చాలా మంది తమకు ఓటువేశారా..? నటిస్తూ కోవర్టులుగా పనిచేశారా? అన్నదానిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ప్రస్తుతం భారీ చర్చ నడుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజానికి ఈ అనుమానం కొంత మంది అభ్యర్థుల్లోనూ ఉండగా.. ప్రధాన పార్టీల్లో మాత్రం ఈ విషయంపై రకరకాల చర్చ జరుగుతున్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలుపు కోసం ఆయన వెంటే ఉన్నామంటూ చెప్పుకొచ్చిన వారు సహకరించారా..? లేక అందులోని కొంతమంది ఇతర పార్టీలకు కోవర్టులుగా మారారా..? అన్న చర్చే ప్రస్తుతం ఆపార్టీలో హాట్‌టాపిక్‌లా మారింది. అంతేకాదు, ఆపార్టీలోని చాలా మంది కూడా అభ్యర్థికి సంపూర్ణంగా సహకరించలేదన్న వాదనలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. స్వయాన ఓ మంత్రి అభ్యర్థి గెలుపు కోసం మీటింగ్ పెడితే.. అక్కడ పాల్గొన్న వారిలో మెజార్టీ మంది వాట్సాప్ స్టేటస్‌లో మరో అభ్యర్థికి ఓటువేయాలని పెట్టిన తీరు ప్రస్తుతం ఆపార్టీలో చిచ్చు రేపుతున్నది.
అలాగే నిత్యం వెంట తిరిగిన చాలా సంఘాలు, నాయకులు సైతం హస్తం అభ్యర్థికి ఓటు వేశారా.. లేదా? అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఓటు వేయకపోగా, కొంతమంది కోవర్టులుగా మారారాన్న అభియోగాలు ఆ పార్టీలోనే వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై చాలా మంది పెద్ద నాయకులకు స్పష్టత ఉన్నా.. ఫలితాల వరకు వేచిచూడాలన్న ధృక్పథంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే పరిస్థితి బీజేపీలోనూ కనిపిస్తున్నది. ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చాలా మంది సహకారం అందించలేదన్న చర్చ ప్రస్తుతం ఆ పార్టీలోనూ నడుస్తున్నది. అయితే అభ్యర్థికి సంబంధించి ప్రచార కార్యక్రమాల సమాచారం తమకు అందలేదని, తమకు సమాచారం లేనప్పుడు తాము ఎలా ముందుకెళ్తామని కొంత మంది సీనియర్లు ఇప్పటికే తేల్చిచెప్పినట్టు తెలుస్తున్నది. అలాగే ఈ పార్టీలోనూ కొంత మంది అటుఇటుగా వ్యవహరించారనే చర్చ ప్రస్తుతం నడుస్తున్నది. మొత్తంగా చూస్తే కౌటింగ్ తర్వాత కాంగ్రెస్, బీజేపీలో భారీగానే ఒడిదొడుకులుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పార్టీల్లో జరుగుతున్న చర్చ చూస్తే.. తమ వెంటే ఉంటున్నట్టు నటించారా..? లేక తెలివిగా ఇతర పార్టీలకు సహకరించారా..? అన్నదే ప్రస్తుతం ఆయా పార్టీలు, అభ్యర్థుల్లో ప్రధాన చర్చగా నిలుస్తున్నది.