Demolish Houses | కోల్ సిటీ, అక్టోబర్ 4 : రామగుండం నగర పాలక సంస్థ 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో ఇండ్ల కూల్చివేత ఘటన అత్యంత వివాదస్పదమైంది. నంబర్ ప్లేటు లేని జేసీబీ వాహనం ఒకటి 30 ఫీట్ల రోడ్డు వెడల్పు ఉందని అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేసేందుకు రాగా, స్థానికులు ప్రతిఘటించడంతో రణరంగంగా మారింది. ‘ముందు మా ప్రాణాలు తీయండి.. ఆ తర్వాతనే ఇళ్ల జోలికి వెళ్లండి… బలవంతగా ఒక్క ఇటుక పెల్ల పెకిలించినా మా శవాలను చూస్తారంటూ’ బస్తీ వాసులు జేసీబీకి అడ్డుగా వెళ్లడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీనితో జేసీబీ డ్రైవర్ అక్కడ నుంచి పలాయనం చిత్తగించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖని ఎన్టీఆర్ నగర్లో శనివారం సాయంత్రం ఇళ్ల కూల్చివేతకు విఫలయత్నం జరిగింది.
నంబర్ ప్లేటు లేని జేసీబీ వాహనం రావడంతో స్థానికులు గుమిగూడి ప్రశ్నించారు. తమకేమి తెలియదని లీడర్లు చెబితేనే వచ్చామంటూ బుకాయించారు. ఇక్కడ 30 ఫీట్ల రోడ్డు వేస్తున్నారనీ, 15 ఫీట్లు వెనక్కి జరపాలని సిబ్బంది చెప్పడంతో స్థానికులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఇళ్లు కూల్చమని మున్సిపల్ అధికారులు చెప్పినట్టు ఏమైనా పత్రాలు ఉంటే చూపించాలని పట్టుబట్టారు. అదంతా తమకేమి తెలియదని సిబ్బంది బదులు ఇవ్వడంతో స్థానికులు జేసీబీని అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు కాలనీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కూల్చివేతలకు వచ్చిన సిబ్బంది తడబడటంతో స్థానికులు అనుమానించి ఎదురుతిరిగారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారేసరికి జేసీబీ సిబ్బంది అక్కడ నుంచి ఉడాయించారు. ఐతే తమ కాలనీలో ఓ సింగరేణి కార్మికుడు నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నాడనీ, అతనంటే పడని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఇదే అదనుగా నాటకీయంగా 30 ఫీట్ల రోడ్డు వెడల్పు పేరుతో బస్తీలో ఇళ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపించారు. ఆకస్మిక సంఘటనతో ఎన్టీఆర్ నగర్ ఉలిక్కిపడింది.