పధ్నాలుగేళ్లు ఉద్యమపార్టీగా.. పదేళ్లు అధికార పార్టీగా.. పదహారు నెలలుగా ప్రతిపక్షపార్టీగా.. ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ గొంతుకగా నిలిచిన భారత రాష్ట్ర సమితి, ఇప్పుడు 25 వసంతంలోకి అడుగు పెట్టబోతున్నది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఎజెండాగా కదిలి, సమైక్య సంకెళ్లు తెచ్చి రాష్ర్టాన్ని సాధించి, పదేళ్లలో తెలంగాణను
అన్నింటా అగ్రగామిగా నిలిపింది. అధికారంలో ఉన్నా.. లేకున్నా తెలంగాణ ప్రజల తోడు నీడగా నిలిచింది. నేడు ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకకు సిద్ధంకాగా, స్వచ్ఛందంగా కదిలేందుకు ఉమ్మడిగడ్డ సిద్ధమైంది.
గుండెల నిండా గులాబీ జెండాను నింపుకొన్న ఉమ్మడి జిల్లా ప్రజానీకం, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలేందుకు సమాయత్తమైంది. ఆదివారం ‘చలో వరంగల్’ అంటూ ఎల్కతుర్తికి కదం తొక్కేందుకు సిద్ధమైంది. ఉదయం గ్రామగ్రామాన గులాబీ జెండాలు ఎగురవేసి ఆ తర్వాత ఎల్కతుర్తి సభకు కదలనున్నది. మరికొద్ది గంటల్లోనే ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయా పట్టణాలు, పల్లెల నుంచి స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సభకు వెళ్లే వారికి భోజన, మంచి నీటి వసతి కల్పించేందుకు పార్టీ పరంగా ఏర్పాట్లు చేసినా, ఎక్కడికక్కడే స్వచ్ఛందంగా సమకూర్చుకున్నారు. ఎండతో ఏ మాత్రం సంబంధం లేకుండా, రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో పకడ్బందీ ప్రణాళికలు చేశారు. ఇదిలా ఉంటే ఆయా నియోజకవర్గాల్లో వారం పది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ప్రత్యేక దృష్టిసారించి, ప్రజలను చైతన్యవంతం చేయడంలో సక్సెస్ అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి రెండులక్షల మందికిపైగా హాజరయ్యే అంచనాలు కనిపిస్తున్నాయి. జన స్పందనచూస్తే అంతకుమించి వచ్చే అవకాశాలున్నాయి.
కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. వారంరోజులుగా పల్లె, పట్నం అన్న తేడా లేకుండా గులాబీ గుబాళింపు కనిపిస్తున్నది. సభకు భారీగా తరలి రావాలంటూ కేసీఆర్, కేటీఆర్ పిలుపునివ్వడం, మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలపై విసుగుచెందిన ప్రజలు తమదైన శైలిలో కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని ప్రతి పల్లెలో జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. గద్దెలకు గులాబీ రంగు వేశారు.
‘జై తెలంగాణ’ నినాదాలు రాశారు. సభకు బయలు దేరే ముందే జెండాను ఎగురవేయాలని నిర్ణయించుకున్న నాయకులు, ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. సభకు వెళ్లేందుకుగాను ఆయా గ్రామాల్లోనే ముందస్తుగా వంటలు వండుకొని, వాటిని సదరు వాహనాల్లో పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల వంటివి సమకూర్చుకొని ఎక్కడా ఇబ్బందులు రాకుండా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోగా, దారి పొడవునా గులాబీ జెండాలను రెపరెపలాడించడమే లక్ష్యంగా ప్రతి వాహనంలో జెండాలు తీసుకెళ్తున్నారు.
రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల పైచిలుకు ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి లక్షాయాభై వేలు కాగా, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి 20 నుంచి 25వేల వేలమంది చొప్పున తరలివెళ్లేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఉన్న స్పందన చూస్తే అంతకు మించి జనం వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తున్నది. తెలంగాణ సాధన కోసం ఆనాడు సబ్బండ వర్గాలు పోరుబాట పట్టినట్టు, ఈసారి రజతోత్సవ సభకు కదులుతున్న పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే వరంగల్ సభకు వెళ్లి కేసీఆర్‌కు మద్దతు పలుకాలన్న లక్ష్యం మెజార్టీ వర్గాల్లో కనిపిస్తున్నది.
ఆదివారం కావడంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు సైతం పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. అలాగే ఈసారి యువతలో సభకు వెళ్లేందుకు ఎక్కువ ఉత్సాహం కనిపిస్తున్నది. మెజార్టీ గ్రామాల్లో యువతే సారథ్యం వహించి ఆయా గ్రామాల ప్రజలను సభకు తీసుకెళ్తున్నారు. ప్రజల స్పందన చూస్తే ప్రస్తుతం పార్టీ పరంగా ఏర్పాటు చేసిన వాహనాలు సరిపోవడం లేదని, అందుకే ఎవరికి వారే స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకొని వస్తున్న తీరు కేసీఆర్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
గులాబీ జెండాకు ఉమ్మడి జిల్లా ఆది నుంచీ అండగా నిలుస్తూ వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి మొదలు నేటి రజతోత్సవ సభ వరకు ముందుండి సంఘీభావాన్ని ప్రకటిస్తూనే ఉన్నది. అదే అభిమానంతో రజతోత్సవ సభకు మరోసారి సత్తా చాటుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి గులాబీ జెండా కష్టకాలంలో ఉన్న ప్రతిసారి ఈ ప్రాంత ప్రజలు అండగా నిలిచారు. కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొని ఆకాశానికి ఎత్తుకుంటూ వచ్చారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001 మే 17న జరిగిన సింహగర్జన సభకు అండగా నిలిచిన ఉమ్మడి జిల్లా ప్రజలు, తర్వాత కూడా తామున్నామనే ధైర్యాన్నిచ్చారు.
2006లో తెలంగాణ వాదమే లేదంటూ హేళన చేసే సమయంలో ఎంపీ పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న కేసీఆర్, తిరిగి పోటీచేస్తే రెండు లక్షల మెజార్టీతో గెలిపించి ప్రత్యేక తెలంగాణ నినాదం ఉందని ప్రపంచానికి చాటి చెప్పారు. అంతేకాదు, పలుసార్లు వచ్చిన ఉప ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికలు, ఆమరణ నిరాహార దీక్ష వంటి అనేక అంశాల్లో కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా అండగా నిలిచింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం రజతోత్సవసభలోనూ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది.
సభకు ఉవ్వెత్తున తరలిపోయేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో జనజాతరకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పరోక్ష పద్ధతుల్లో కుట్రలకు తెరలేపిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా సభకు ప్రజలను తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ బస్సులకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్కూల్ బస్సుల విషయంలోనూ అదే పంథాను ప్రభుత్వం అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది.
అలాగే సభకు వెళ్లకుండా మధ్యమధ్యలో ట్రాఫిక్ బూచి చూపి, ఎక్కడికక్కడే వాహనాలను నిలుపుచేసే అవకాశాలు ఉన్నాయని అత్యంత విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తున్నది. దీంతో పాటు ఇప్పటికే పలు ప్రైవేట్ వాహనాలకు ఫోన్‌చేసి, సభకు వెళ్తే చర్యలు ఉంటాయన్న సంకేతాలను కొంత మంది అధికారుల ద్వారా ఇప్పిస్తున్నట్టు సమాచారం. కానీ, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభకు వెళ్లి తీరుతామనే పట్టుదల అడుగడుగునా కనిపిస్తున్నది.
ఎల్కతుర్తిలో సిద్ధమైన రజతోత్సవ సభా వేదిక