దసరా ముందు నుంచే మార్కెట్లకు పత్తి వస్తున్నా సీసీఐ మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. దీపావళి తర్వాతగానీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు తేమ శాతం అధికంగా ఉన్న పత్తి వస్తుందని, ఎఫ్ఏక్యూ ప్రకారం తేమ ఉంటే తప్ప కొనుగోళ్లు చేయలేమని అధికారులు చేతులెత్తేయగా, రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో తేమను సాకుగా చూపి తక్కువకే కొంటుండగా కనీస మద్దతు ధర దక్కకుండా పోతున్నది. అసలే పుండు మీద కారం చల్లినట్టు అకాల వర్షాలతో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. దీపావళి తర్వాతనే సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరపాలని సీసీఐ నిర్ణయించింది. జిల్లాలో 42,730 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఎకరాకు 9 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చినా 3,84,570 క్వింటాళ్లు అంటే 38.45 వేల మెట్రిక్ టన్నులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో మార్కెట్‌కు సుమారు 32 వేల టన్నులు రావచ్చని భావిస్తున్నారు. దసరాకు ముందే మొదటిసారి పత్తిని ఏరిన రైతులు ఇప్పడిప్పుడే విక్రయాలకు తీసుకొస్తున్నారు. అయితే, సీసీఐ కేంద్రాలు తెరువకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
ఇదే అదునుగా తేమ అధికంగా ఉందని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర 7,521 దక్కకుండా పోతున్నది. జమ్మికుంటలాంటి పెద్ద మార్కెట్‌కు దసరా ముందు నుంచే కొత్త పత్తి వస్తున్నది. రెండు రోజులుగా చూస్తే పత్తి ధర ఎమ్మెస్పీ కంటే చాలా తక్కువ పలుకుతున్నది. మోడల్ ధర క్వింటాల్‌కు 6,600, గరిష్ఠ ధర 6,950, కనిష్ఠ ధర 6 వేలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గురువారం కరీంనగర్ మండలం ఎలబోతారంలోని శక్తి మురుగన్ ఇండస్ట్రీస్‌లో కాస్త మెరుగ్గా 7 వేలకు క్వింటాలు చొప్పున కొన్ని క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కరీంనగర్ మార్కెట్లో కూడా దారుణంగా పత్తి ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,500 క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు చెబుతున్నా అంతకంటే ఎక్కువే కొన్నట్టు తెలుస్తున్నది.
సీసీఐ నిబంధనలు చూస్తే కఠినంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో పత్తిని సీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేసే అవకాశం లేదు. 8 శాతం తేమ ఉండి పింజ 30.5 నుంచి 29.5 ఎంఎం ఉంటేనే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 7,521 చెల్లిస్తుంది. పింజ ఎంఎం తగ్గినా ధర తగ్గిస్తుంది. ఇదే 8 శాతం తేమ ఉండి 29.49 నుంచి 29.01 ఎంఎం ఉన్న పత్తికి 7,471 ఇస్తుంది. ఇదే తేమ శాతంలో 28.5 నుంచి 27.5 ఎంఎం పింజకు 7,421 మాత్రమే చెల్లిస్తుంది.
అంతే ఎంఎం తగ్గిన కొద్దీ 50 తగ్గించేస్తుంది. అందులో 12 శాతం తేమ ఉన్న పత్తికి 28.5 నుంచి 27.5 ఎంఎం ఉన్న పింజకు 7,124 చెల్లిస్తుంది. ఇలా తేమ శాతాన్ని, పత్తి పింజ వెడల్పును లెక్కించిగాని సీసీఐ కనీస మద్దతు ధర చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు. తేమ ఒక శాతం పెరిగితే ఎమ్మెస్పీలో ఒక శాతం అంటే 75.21 తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలో సీసీఐ కేంద్రాల్లోనూ కనీస మద్దతు ధర లభించే పరిస్థితి కనిపించడం లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం అధికంగా ఉంటే ప్రైవేట్ వ్యాపారులు సైతం ధర తగ్గిస్తారనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది.
సీసీఐ ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తినే కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తేమ 25 నుంచి 30 శాతం వస్తున్నది. ఈ నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయలేమని ఇటీవల జరిగిన సమావేశంలో సీసీఐ అధికారులు తేల్చి చెప్పారు. వర్షాలు తగ్గితే దీపావళి తర్వాతనే తాము కొనుగోళ్లు ప్రారంభిస్తామని జిల్లా ఉన్నతాధికారుల ముందే సీసీఐ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మొత్తం తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఎలబోతారంలోని శక్తి మురుగన్ ఇండస్ట్రీస్, మల్కాపూర్ పరిధిలోని మల్లారెడ్డి కాటన్ ఇండస్ట్రీస్, రేణికుంటలోని రామినేని ఆగ్రో ఇండస్ట్రీస్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలో వైభవ్ కాటన్ కార్పొరేషన్ అండ్/ఆదిత్య కాటన్ అండ్ ఆయిల్ ఆగ్రోటెక్ ఇండస్ట్రీస్, మురుగన్ ఇండస్ట్రీస్ అండ్ కాటన్ జిన్నింగ్ ప్రెస్సింగ్ అండ్ ఆయిల్ మిల్, రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీస్, సీతారామ కాటన్ ఇండస్ట్రీస్‌లో, చొప్పదండి వ్యవసాయ మార్కె ట్ పరిధిలో రుక్మాపూర్‌లోని శివ శివాని కాటన్ ఇండస్ట్రీస్, గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో వెలిచాలలోని కావేరి జిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పత్తి కొనుగోళ్లు జరపాలని నిర్ణయించింది.
వానలొస్తన్నయని భయమైతంది. ఫస్ట్ ఏరిన పత్తికి మంచి ధర వస్తందని ఇక్కడికి వచ్చిన. కొంచెం మంచిగనే వచ్చింది. నేను మొత్తం ఏడు క్వింటాళ్లు తెచ్చిన. 6,700 చొప్పున తీసుకున్నరు. మా పత్తి మంచిగున్నది. సీసీఐకి అమ్మితే ఇంకొంచెం ఎక్కువ పైసలు వచ్చేటియి. ఇప్పుడు సీసీఐ కేంద్రాలు ఎక్కడున్నయి? పైసలు సుతం అవుసరం ఉండే. అందుకే అమ్మిన.
– బోడపల్లి పుష్పలత, హిమ్మత్‌నగర్ (గంగాధర)
నా పత్తి చాన బాగున్నది. ఇక్కడి సేట్లు సుతం మరీ అన్యాయం చెయ్యకుంట మంచి ధర ఇచ్చిన్రు. రెండు క్వింటాళ్లు తెస్తే ఏడు వేల చొప్పున కట్టిచ్చిన్రు. సీసీఐల అయితే మద్దతు ధర వచ్చేటిది. ఏంజేసుడు? వాళ్లు ఇప్పుడే కేంద్రాలు పెట్టరాయె. దీపావళి ఎల్లెదాక మా ఆగచ్చు. వానలు ఎట్లనో ఉన్నయి. అయింత ధర రాదని ఇప్పుడే అమ్ముకున్న. చేన్ల ఉన్న పత్తిని చూసి భయమైతంది. గిట్లనే వానలువడితే పత్తంతా దెబ్బతింటది.
– అచ్చ రమేశ్, నగునూర్, (కరీంనగర్ రూరల్)