జీవితాలను ఛిద్రం చేస్తూ, బతుకులను అంధకారంలో పడేసే పేకాట రూపుమారింది. పెరిగిన సాంకేతిక నైపుణ్యంతో దేశమంతా నగదు రహిత లావాదేవీల్లోకి వెళ్లిపోతుండగా, ‘శత కోటి దరిద్రాలకు, అనంత కోటి ఉపాయాలన్నట్టు’ ఈ మార్పు పేకాటరాయుళ్లకు అవకాశంగా మారింది. గతంలో ఈ జూదం ఆడుతున్న సమయంలో దాడులు చేస్తే నగదు దొరికినా, ఇప్పుడు జేబులో రూపాయి లేకుండా ఈ ఆట జోరుగా సాగుతున్నది. మొబైల్ ఫోన్ల నుంచే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నది. కేసీఆర్ పాలనలో ఉక్కుపాదం మోపడంతో మూతపడ్డ శిబిరాలన్నీ మళ్లీ పుట్టుకొస్తుండగా, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణాల్లో విచ్చలవిడిగా స్థావరాలు సాగుతున్నట్టు తెలుస్తున్నది.
జగిత్యాల, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సర్కారు జూదంపై నిషేధం ప్రకటించింది. పేకాటతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని భావించి ఉక్కుపాదం మోపింది. అందులో భాగంగా పేకాట శిబిరాలపై పోలీస్‌శాఖ దాడులు చేయడంతో చాలా చోట్ల మూతపడ్డాయి. పేకాట కోసం వెలిసిన రిక్రియేషన్ క్లబ్బులు సైతం కనుమరుగయ్యాయి. క్లబ్బులు సైతం బెదిరిపోయాయి.
అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత అన్ని రంగాల్లో ఆర్థిక లావాదేవీలు మందగిస్తే, పేకాట మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం, ఆన్లైన్ పేమెంట్స్‌పై విస్తృతంగా అవగాహన కల్పించడంతో చాలా మందికి స్వైప్ మిషన్, మొబైల్, యాప్స్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌పై పట్టు చిక్కింది. ఈ క్రమంలోనే పేకాట నిషేధం నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ జూదరులు నగదు రహిత లావాదేవీలను వినియోగించుకుని ఆడే ప్రక్రియను కొనసాగించడం మొదలైంది.
అంతా నగదు రహితమే!
జిల్లాలో నగదు రహిత జూదం విచ్చలవిడిగా సాగుతున్నది. పలువురు రాజకీయ నాయకులు, వైద్యులు, అధికారులు, టీచర్లు, పోలీసులు ఈ జూదం ఆడుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ ఆటను నిర్వహించే వారందరూ పెద్ద ధనవంతులేననే ఆరోపణలున్నాయి. కాగా, గతంలో మండల స్థాయిలో కీలక బాధ్యతలు పోషించిన ఓ వ్యక్తి పెద్ద పేకాట శిబిరం నిర్వహించేవాడన్న విషయం బహిరంగ రహస్యమే.
జూదం నిర్వహకులంతా కరెంట్ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నవారే. కొందరు ఈ అకౌంట్ల ఆధారంగా స్వైప్మిషన్లతో చెల్లింపులు చేస్తే.. మరికొందరు సెల్ఫోన్లలో యాప్స్ ద్వారా నగదును బదిలీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే జేబులో ఒక్క రూపాయి లేకున్నా చేతిలో సెల్ఫోన్లు పట్టుకొని పేకాడుతుండగా, పెద్ద మొత్తంలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పట్టణంలో పలు ఇండ్లల్లో నగదు రహిత పేకాట స్థావరాలు ప్రారంభమైనట్లు సమాచారం కాగా, గతంలో పేకాట స్థావరాలను నిర్వహించిన వారే సాంకేతిక నైపుణ్యాన్ని వంటబట్టించుకొని ఈ శిబిరాలను నడుపుతున్నట్టు తెలుస్తున్నది.
సులువుగా ఆట
జూదరులకు నగదు రహిత ఆట కలిసి వచ్చింది. గతంలో జూదం ఆడేందుకు పెద్ద తతంగమే ఉండేది. జూదం నిర్వహించే స్థలం, రక్షణ మార్గాలు, ఆడే వారికి చాయ్ నుంచి మొదలు కొని మందు వరకు ఏర్పాట్లు తదితర వ్యవహారం సాగేది. దీంతో నిర్వాహకులు, జూదరులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని పేకాట స్థావరాలకు వెళ్లేవారు. ఆయా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో జూదరులు, బైకులు, కార్లు నిలిచి ఉండేవి.
ఒకరకంగా పేకాట స్థావరాల వద్ద పెద్ద కోలాహాలమే ఉండేది. పోలీసులు దాడి చేసే సందర్భంలో అందరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుపడేవి. బైకులు, కార్లు ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో జూదరులు దొరికిపోయేవారు. ఇక పేకాడేవారి వద్ద డబ్బులు పట్టుబడడంతో పోలీసులు కచ్చితంగా కేసులు నమోదు చేసే వారు. అయితే ఇప్పుడు నగదు రహిత వ్యవహారం నేపథ్యంలో జూదం ఆడేవారి వద్ద ఒక్క రూపాయి కూడా దొరకడం లేదు.
గతం కంటే సేఫ్‌గా పేకాడుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని, ఎవరితోను ఇబ్బందులు లేవని, కేసులయ్యే అవకాశాలు తగ్గిపోయాయని జూదరులు అంటున్నారు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు పేకాటకు లైసెన్స్ దొరికినట్లేనని చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీల వ్యవహారానికి ప్రాధాన్యత పెరగడం, సాంకేతిక నైపుణ్యం ఇలా ఉపయోగపడడంతో పేకాటరాయుళ్లకు అడ్డు లేకుండా పోయింది.
మళ్లీ పుంజుకుంటున్న జూదకేంద్రాలు?
కేసీఆర్ సర్కార్ మారడంతో మళ్లీ పేకాట స్థావరాల జోరు పెరిగినట్టు తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో పోలీసులు పట్టుకున్నట్లు చేస్తున్న ప్రకటనలే అందుకు ఉదాహరణ. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఒక ఇంట్లో జూదం ఆడుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించిన పోలీసులకు జగిత్యాల పట్టణంలోని కొన్ని ఇండ్లు ఇప్పటికే పేకాట కోసం అద్దెకు తీసుకొని శిబిరాలు నిర్వహిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
సాధారణ గృహాల మధ్య ఉన్న ఇండ్లలో ఎవరికి అనుమానం రాకుండా స్థావరాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కరీంనగర్-జగిత్యాల జిల్లాల మధ్య ఉన్న ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒక మండలంలో అటవీ ప్రాంతం అధికంగా ఉంది. ఇక్కడ గతంలో నిత్యం పెద్ద పెద్ద పేకాట స్థావరాలు నడిచేవి. అయితే నిఘా పెరిగిన నేపథ్యంలో పేకాట శిబిరాలు చాలా మట్టుకుతగ్గిపోయాయి. అయితే రూటు మార్చిన కొందరు నిర్వాహకులు అటవీ లోపలి ప్రాంతంలోకి స్థావరాలను తరలించి, చిన్నచిన్నగా శిబిరాలను ఏర్పాటు చేసి, దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కోరుట్ల నుంచి చందుర్తి వెళ్లే ప్రాంతంలోను పేకాట స్థావరాలు ఉన్నట్లుగా తెలిసింది. రాయికల్ మండలంలోని అటవీ ప్రాంతంలోని మామిడి తోటల్లోను పేకాట కొనసాగుతున్నట్లుగా సమాచారం. నగదు రహిత పేకాటపై కొందరు అధికారులు మాట్లాడుతూ, అలాంటి వాటిని ఏం చేయలేమని, పేర్కొంటుండడం గమనార్హం. ఏది ఏమైనా పెరిగిన సాంకేతిక నైపుణ్యత జనావళికి మంచి చేయాలి గానీ, ఇలా తప్పుడు చర్యలకు సైతం ఊతంగా నిలుస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు.