గంగాధర, జూన్ 11: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువచ్చి, తెలంగాణ గడ్డపై తిరిగి గులాబీ జెండాను ఎగురేద్దామని, మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో చేపట్టిన సభ్యత్వ నమోదు విజయవంతానికి కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలని సూచించారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు, సర్‌పై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించగా, ఎమ్మెల్సీ ఎల్ రమణ, సభ్యత్వ నమోదు చొప్పదం డి ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డితో కలిసి జీవన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నిండా ముంచిందన్నారు. రాష్ట్రంలో నాడు కేసీఆర్ ప్రజాపాలన సాగిస్తే, నేడు రేవంత్‌రెడ్డి ప్రజా వంచన పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా హామీలను పూర్తిగా అమలు చేయలేదన్నారు. రైతు భరోసా మూడు పంటలకు ఇవ్వలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదని, కల్యాణలక్ష్మి కింద ఇస్తాన్న తులం బంగారం, అసహాయులకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరు గు పేరిట క్వింటాల్‌కు పది కిలోలు కోతపెడుతూ రైతులను బహిరంగంగానే ముంచుతున్నా పట్టించుకునే దిక్కేలేదని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.2వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకుని రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని ఆగ్రహం వ్య క్తం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లారీలెక్కి తిరగడం కాదని, ధర్మకాంట తూకం ప్రకారం రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించే దమ్ముందా..? అని ప్రశ్నించారు. ఇక్కడ నాయకులు సాగి మహిపాల్‌రావు, దూలం బాలగౌడ్, మేచినేని నవీన్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, సత్తినేని మాధవ్, సత్తినేని భాగ్యలత, తైదల శ్రీలత, ఐల్నేని సాగర్‌రావు, గంట్ల జితేందర్‌రెడ్డి, ద్యావ మధుసూదర్‌రెడ్డి, గడ్డం చుక్కారెడ్డి, మాచెర్ల వినయ్, బందారపు అజయ్, జనగం శ్రీనివాస్, కత్తెరపాక కొండయ్య, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, దూలం శంకర్‌గౌడ్, గడ్డం స్వామి, వేముల దామోదర్, రామిడి సురేందర్, తదితరులు ఉన్నారు.
హామీల అమలులో విఫలం: ఎల్ రమణ
ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రె స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర బడ్జెట్‌ను రూ.లక్ష కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేటీఆర్, హరీశ్‌రావుకు జీవన్‌రెడ్డి తోడు కావడంతో ఉమ్మడి కరీంనగర్లో బీఆర్ఎస్ మరింత బలోపేతమైందన్నారు. సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసు లు పెడుతున్నారని, కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కితే, ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికి దక్కుతుందని చురకలంటించారు.
ఆదర్శంగా నిలువాలి: భూపతిరెడ్డి
లక్ష సభ్యత్వాలతో చొప్పదండిని రాష్ర్టానికి ఆదర్శంగా నిలుపాలని సభ్యత్వ నమోదు చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్త గా వచ్చిన యువతకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలియదని, కార్యకర్తలు వారికి వివరించాలన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సోనియాగాంధీ ఇచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని, కానీ సబ్బండవర్గాలన కలుపుకొని కేసీఆర్ 14 ఏండ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత: సుంకె
ఆచరణ సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కి పాలనలో విఫలమైన కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని, ఏ ఊరికి వెళ్లి నా, ఎవరిని కదిలించినా ‘కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి’ అన్న నినాదమే వినిపిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కాళేశ్వరంను కూలేశ్వరం అన్న రేవంత్‌రెడ్డికి నేడు అదే ప్రాజెక్టు దిక్కయిందన్నారు. కేసీఆర్‌కు నిర్మించడం తెలిస్తే.. రేవంత్‌కు కూల్చడం తప్ప మరేమీ తెలియదని మండిపడ్డారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిన సమయంలో కొన్ని తప్పులు జరిగినట్లు, మళ్లీ గెలిచిన తర్వాత పార్టీ కోసం పని చేసిన కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూసే వరకు కార్యకర్తలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ను గద్దె దించాలి: రవీందర్‌రెడ్డి
రాష్ట్రంలో అవినీతి కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు పోరాటం చేయాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గంగాధర మండలంలో వడ్లు కొనుగోలు చేయాలని కోరిన 8 మంది రైతులపై కేసు నమోదు చేసి ఇబ్బంది పెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో సైతం ఎల్లంపల్లి నుంచి చెరువులను నింపి పంటలకు సాగు నీరందించామని, నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు, నాయకులకు ఆ సోయే లేదని మండిపడ్డారు.