రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల జిల్లాలో హత్య, శవ రాజకీయాలను ప్రజలు సహించరని, నేత కార్మికుడు వెంగల వెంకటేశం హత్య కేసులో నిందితుడితో పాటు సూత్రధారులను, పాత్రదారులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించాలంటూ మంగళవారం జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలను సహించేది లేదని నినదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలో నేత కార్మికుడు వెంగల వెంకటేశం హత్యకు గురవడం బాధాకరమన్నారు. నేత కార్మికుడి హత్య బీఆర్ఎస్ పార్టీకి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు రుద్దే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
వెంకటేశం హత్య రాజకీయ కుట్ర కోణంలో ఉందని, ఇందులో నిందితుడితో పాటు సూత్రధారులు, పాత్రాదారులు అధికార పార్టీ నేతలు ఉన్నారని, ప్రణాళిక ప్రకారమే హత్య జరిగినట్లు ఆరోపించారు. పోలీసులపై తమకు అపారమైన గౌరవం ఉన్నదని, నిష్పాక్షపాతంగా విచారణ చేసి నిందితులను రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ నేత కార్మికుడు వెంగల వెంకటేశం హత్యకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో అధికార పార్టీ నేతల దౌర్జన్యం, గుండా, రౌడీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు నేత కార్మికుడి ప్రాణం బలిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మ్యాన రవి, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగం, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.