పెద్దపల్లి/జగిత్యాల/ సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 9: ‘విజయ్ దివాస్’ను ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలతోపాటు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగొచ్చిందని, 2009 డిసెంబర్9న ఆనాటి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిందని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేశారు. ఇది ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజని, స్వరాష్ట్ర సాకారానికి పునాది వేసిన రోజని అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణకు నాందిపడిన ఈ రోజును విజయ్ దివస్‌గా జరుపుకొంటున్నామని చెప్పారు. సకలజనుల సమ్మతితో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
సిరిసిల్ల కొత్త బస్టాండ్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వేములవాడలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, తంగళ్లపల్లిలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఇల్లంతకుంటలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలతోపాటు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అలాగే జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పూలమాలలు వేశారు. అనంతరం తెలంగాణ అమరవీరుల చిత్రపటం వద్ద నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాలాభిషేకం చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ అమరణ నిరాహార దీక్షతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. జూలపల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ తల్లి చిత్ర పటానికి పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్ పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నల్లకండువాలు మెడలో వేసుకుని నిరసన తెలిపారు.
ఉద్యమానికి స్ఫూర్తి
పెద్దపల్లి, డిసెంబర్ 9 : నాడు రాష్ట్ర ఉద్యమానికి తెలంగాణ తల్లి విగ్రహం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమ చరిత్రలో ‘డిసెంబర్ 9’ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని అభివర్ణించారు. సోమవారం పెద్దపల్లి అయ్యప్ప దేవాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, మాట్లాడారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో 2009 డిసెంబర్ 9న ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నాంది పడిన ఆ రోజును స్మరించుకుంటూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలతో అలంకరించామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, నాంసాన సరేశ్ బాబు, రేవల్లి స్వామి, కనుకుర్తి కార్తీక్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రామగిరి చంద్రమౌళి, ఫహీం, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి ఛీత్కారం తప్పదు
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 9: సకలజనుల సమ్మతితో ఏర్పడిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చిన ప్రభుత్వానికి ప్రజల చేతుల్లో ఛీత్కారం తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. హంతకుడే నివాళులర్పించిన చందంగా తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడం బాధాకరమన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో తెలంగాణ విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి, అంబేద్కర్ చిత్రపటాలకు ఆగయ్య పాలాభిషేకం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంతో సంబంధంలేని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ఉద్యోగుల సమ్మతంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నాడు రూపొందించుకుని గ్రామగ్రామాన ఏర్పాటు చేసుకున్నామన్నారు. సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చగలరేమో గానీ.. గ్రామగ్రామాన కొలువుదీరిన తెలంగాణ తల్లుల విగ్రహాలను మార్చడం ఎవరికి సాధ్యంకాదన్నారు. ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, దిడ్డి రాజు, దార్ల సందీప్, జక్కుల నాగరాజుయాదవ్, విజయేందర్‌రెడ్డి, కొండ రమేశ్‌గౌడ్, పోచవేని ఎల్లయ్యయాదవ్, బుర్ర మల్లికార్జున్‌గౌడ్, బూర తిరుపతి, ప్రేమ్‌కుమార్, అడ్డగట్ల మురళి, దార్నం అరుణ, శివజ్యోతి, సిలువేరి చిరంజీవి, అడ్డగట్ల భాస్కర్, జక్కుల యాదగిరి, సబ్బని హరీశ్ పాల్గొన్నారు.
విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వం
జగిత్యాల, డిసెంబర్ 9: తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విమర్శించారు. తెలంగాణ తల్లి అంటే ఒక దేవతామూర్తి అని.. కిరీటం లేకుండా ఎక్కడైనా దేవత ఉంటుందా..? అని ప్రశ్నించారు. చెయ్యి గుర్తుతో ఉన్న కొత్త విగ్రహం కాంగ్రెస్ తల్లి విగ్రహమే అవుతుంది కానీ, తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పటికీ కాదన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో తెంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు. కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. ఈ మేరకు శనివారం జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం తెలంగాణ అమరవీరుల చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, టీఎస్‌ను టీజీగా, రైతుబంధును రైతుభరోసా మార్పు చేయడమే తప్పా.. ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం 1.5శాతం మాత్రమేనని, కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వారంతా బాధపడుతున్నారన్నారు. సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు. రేవంత్‌రెడ్డిది దుర్మార్గపు పాలన అని మండిపడ్డారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఏకంచేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, బీఆర్ఎస్ జగిత్యాల పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్‌రావు, మాజీ జడ్పీటీసీ నాగం భూమయ్య, నాయకులు శీలం ప్రియాంక ప్రవీణ్, తెలు రాజు, బర్కం మల్లేశం, ఆయిల్నేని ఆనందరావు, పడిగెల గంగారెడ్డి, రిజ్వాన్, వొల్లాల గంగాధర్, నిరంజన్, రాము, నాచుపెల్లి రెడ్డి, గంగం స్వామి, చింతల గంగాధర్, సన్నిత్రావు, గాజుల శ్రీనివాస్, ఆయిల్నేని వెంకటేశ్వర్రావు, ప్రతాప్ పాల్గొన్నారు.