మానకొండూర్ రూరల్, అక్టోబర్ 28 : మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజక ఇన్చార్జి గడ్డం నాగరాజు కమలాన్ని వీడి త్వరలో కారెక్కనున్నారు. గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఈసారి టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. గత 32 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కష్టపడిన తనను కాదని కొత్తగా ఇటీవలే చేరిన వ్యక్తికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తి చెందారు.
భవిష్యత్ కార్యాచరణ కోసం గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే శనివారం మానకొండూర్ మండల కేంద్రంలో గడ్డం నాగరాజు ఇంటికి ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్‌తోపాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు స్వయంగా వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. తన ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే, జీవీఆర్ను నాగరాజు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే, జీవీఆర్ మాట్లాడుతూ, నాగరాజు మానకొండూర్ నియోజకవర్గంలో చేసిన సేవలను గుర్తించి సముచిత స్థానం ఇస్తామని, ఆయన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు.
నాగరాజు మాట్లాడుతూ, త్వరలో భారీ సంఖ్యలో తన అనుచరులతోపాటు బీజేపీ కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిపారు. కాగా, ఈ పరిణామంతో మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మానకొండూర్ జడ్పీటీసీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్, దేవ సతీశ్ రెడ్డి, మానకొండూర్ బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పిట్టల మధు, ఉప సర్పంచ్ నెల్లి మురళి, సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, నెల్లి శంకర్, శాతరాజు యాదగిరి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్ గౌడ్, నాయకులు సునీల్, అనిల్, కిరణ్, వెంకటస్వామి, కొట్టె రఘు ఉన్నారు.