DCP Bhukya Ram Reddy | పెద్దపల్లి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా భూక్యా రామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీసీపీ పుల్ల కరుణాకర్ స్థానం లో సీఐడీ విభాగం లో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డి డీసీపీ గా నియమితులయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల లోని గర్జనపల్లికి చెందిన ఆయన 1989 బ్యాచ్ ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి అంచలంచలుగా ఎదిగి 2020లో ఐపీఎస్ హోదా సాధించారు.
ఈ సందర్భంగా డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా, శిశు రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, యువతలో నేర ప్రవృత్తుల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని, ప్రతి పోలీసు సిబ్బంది సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లలో, సీఐ ల వద్ద, ఏసీపీ లను సంప్రదించాలని, సమస్య పరిష్కారం కాకపోతే డీసీపీ ఆఫీసు కు రావాలని అన్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, గంజాయి సేవించేవారిని, నిషేధిత మత్తు పదార్థాలు అక్రమ రవాణా, సరఫరా, నిల్వ చేయడం వంటి వాటిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలిపారు. ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఫోన్లో నేరుగా సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు.