Pegadapally | పెగడపెల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంటుందని, ఇది బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న బందు అని ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బిజెపి జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం విమర్శించారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 లో ఎన్నికల ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంతో చెలగాటమాడి బీసీలకు తీరని మోసం చేసిందని, బిసీల ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ప్రేమ లేదని అందుకే 56శాతం ఉన్న బీసీలకు రెండు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. కానీ 2023 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ అన్న విషయం మంత్రి భట్టి గుర్తుంచుకోవాలని అన్నారు. జీవో నెంబర్ 9పై ఉత్తర్వులు వచ్చిన రోజే తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేసుకొని తెలంగాణ బీసీలను ఆశల పల్లకిలో ఊరేగించి ఇప్పుడు ఊసురు మనిపించారని సత్యం విమర్శించారు.
ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి నాయకులు తిరుమని రమణారెడ్డి, గంగుల కొమురెల్లి, చింతకింది అనసూయ, తోడేటి గట్టయ్య, కడారి జనార్దన్, మంద భీమయ్య, చింతకింది కిషోర్, మార్కొండ రాజిరెడ్డి, రాజశేఖర్, రాజన్న, రంగు సాగర్, పెద్ది భీరయ్య, తిరుమణి అజయ్ తదితరులు పాల్గొన్నారు.