రాంనగర్, ఆగస్టు 5: నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా బార్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటల తర్వాతే తెరవాల్సి ఉంటుంది. వైన్స్లైతే రాత్రి 10:30 గంటల వరకు, బార్లు రాత్రి 11:30 వరకు మూసివేయాల్సి ఉంటుంది. కొద్దిపాటి గ్రేస్ పీరియడ్‌తో సకాలంలో క్లోజ్ చేయాలి. కానీ, కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు బార్లు తెల్లారే తెరుచుకుంటున్నాయి. ఓ వైపు అర్ధరాత్రి దాకా నడిపిస్తూనే, మరోవైపు క్లీనింగ్ పేరిట తెల్లారకముందే ఓపెన్ అవుతున్నాయి.
బస్టాం డ్ సమీపంలోని పలు బార్లు, అంబేదర్ స్టేడియానికి వెళ్లే దారిలో మరో బార్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. క్లీనింగ్ పేరిట ఉదయం 7గంటలకే తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. దీంతో నగరవాసులు ఇ బ్బందులు పడుతున్నారు. అంబేద్కర్ స్టేడియం దారిలో బార్ ముందు నుంచే వెళ్లాల్సి రావడంతో వాకర్స్‌తోపాటు స్థానిక ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్లపై మందుబాబులను చూసి యువకులు, సీనియర్ సిటిజన్లు భయపడిపోతున్నారు. ఇదంత కండ్లముందే కనిపిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా అధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా ఓపెన్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.