Godavarikhani Stadium | కోల్ సిటీ, జూన్ 17: గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి స్టేడియంలో కోతుల బెడద నివారణకు రామగుండం నగర పాలక సంస్థ నడుం బిగించింది. ‘వానరాలు ఇట్ల… వాకింగ్ ఎట్ల.. అదనపు కలెక్టర్ గారూ.. జర దేఖో’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు మంగళవారం సాయంత్రం రంగంలోకి దిగారు. స్టేడియంలో పంజరం వేసి కోతులను బంధించే చర్యలకు ఉపక్రమించారు.
కొద్ది రోజులుగా స్టేడియంలో వందల సంఖ్యలో వానరాల బీభత్సంతో వాకర్స్ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక దశలో చేతిలో కర్రల సాయంతో వాకింగ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ కథనంతో అధికారులు స్పందించారు. స్టేడియంలో పంజరం ద్వారా కోతులను ఒక్కొక్కటిగా బంధించడంతో వాకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీకి వాకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా వందల సంఖ్యలో వానరాలు ఉండగా మంగళవారం సాయంత్రం వరకు కేవలం పదుల సంఖ్యలోనే కోతులు పట్టుబడ్డాయి.