Ramagundam | కోల్ సిటీ, జూలై 31: నగర పరిశుభ్రతపై రామగుండం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అరుబయట చెత్త పడేస్తున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు గురువారం గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తాలో రోడ్లపై చెత్త పడేసిన వ్యాపారులకు జరిమానాలు విధించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చెత్తను ఊడ్చి తీసుకవెళ్లిన కొద్ది సేపటికే దుకాణాల వ్యాపారులు మళ్లీ రోడ్లపై చెత్తను పడేశారు. నగర పాలక సంస్థ అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు అధికారులు మరోసారి పర్యవేక్షించగా రోడ్లపై చెత్త వేసిన ఆరుగురు వ్యాపారులకు ఒక్కొక్కరికి మొదటి తప్పుగా భావించి రూ.500 చొప్పున జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం తెలిపారు.
చెత్తను బయట పడవేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి వేర్వేరు డబ్బాలలో వేసి మున్సిపల్ వాహనాలకు అందించి సహకరించాలని కోరారు. అలాగే పవర్ హౌజ్ కాలనీలో పిచ్చి చెట్లు, పొదలు తొలగించారు. రఘుపతి రావు నగర్ లో వాల్ పెయింటింగ్ వేశారు. గాంధీనగర్ లో శిథిలావస్థలో ఉన్న కట్టడాలను టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో తొలగించారు. మరికొన్నింటికి ఖాళీ చేయాలని నోటీసులు అందించారు. నూతన ఇళ్లను గుర్తించి కొలతలు నమోదు చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో టీపీవో నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఆర్ఐ శంకర్ రావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, జవాన్లు సుగుణాకర్, యూసఫ్, అడెపు శ్రీనివాస్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.