Bakrid celebrations | హుజూరాబాద్ టౌన్, జూన్ 7 : పట్టణంలో బక్రీద్ వేడుకలను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గాలో ముస్లింలందరు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత గురువు బక్రీద్ పండుగ సందర్భంగా పండుగ ప్రాముఖ్యత, విశిష్టతను వివరించారు. ఖురాన్ లో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ప్రతీ ముస్లిం పాటించాలన్నారు.
శాంతియుతంగా జీవించాలని, పేదలకు సాయం చేయాలని ప్రజలందరూ ధనిక పేద తేడా లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. ప్రార్థనల అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పూర్వికుల సమాధుల వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామే మస్జిద్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని అన్నారు.
అలాగే మున్సిపాలటీ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసిన ఏసీపీ మాధవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈద్గాలోని ప్రత్యేక ప్రార్థనలలో మత గురువు ముఫ్తీ షాకీర్, జామే మసీద్ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.