కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జ్యోతినగర్/పెద్దపల్లి రూరల్/ సిరిసిల్ల తెలంగాణచౌక్, సెప్టెంబర్ 4: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో బోధన, పరిశోధనల్లో ప్రతిభకు గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వం ఎంపిక చేసింది.
గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో సన్మానంతోపాటు పురస్కారాన్ని ప్రదానం చేయబోతున్నది. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉత్తమ బోధన , పరిశోధనలకుగాను యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ హెఓడీగా డాక్టర్ కే పద్మావతి, యూనివర్సిటీ పరిధిలోని ఎస్సారార్ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ బూర్ల నరేశ్ ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ టీటీఎస్ జడ్పీ హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్‌కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
విద్యార్థులకు మెలకువలతో కూడిన బోధన అందించడం, గతంలో సంచార ప్రయోగశాల ద్వారా జిల్లాలోని 102 హైస్కూళ్లలో తన సొంత ఖర్చులతో విద్యార్థులకు ఎగ్జిబిట్స్ నమూనాలు అందజేసినందుకుగాను గుర్తింపు దక్కింది. అలాగే పిల్లలకు బోధనతోపాటు సైన్స్, సామాజిక అంశాలపై పట్టుసాధించేలా చేస్తున్న కృషికిగాను సిరిసిల్ల ప్రభుత్వ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ పాకాల శంకర్‌గౌడ్ ఎంపికయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు దీక్ష పోర్టల్, ఐఎఫ్బీ ప్యానల్లకు డిజిటల్ కంటెంట్ తయారు చేయడంలో కీలక భూమిక పోషించి, టీ షాట్ చానల్ ద్వారా బ్రిడ్జి కోర్సులో డిజిటల్ తరగతులను బోధించడంతో పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి జడ్పీ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్(సాంఘిక శాస్త్రం) మార రమేశ్ ఎంపికయ్యారు.