తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 3: విద్యారంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నదని, పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరిగ్రాండ్ ఫంక్షన్హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన టీచర్స్ డే వేడుకలకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఎంచుకోవాలని సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో టీచర్ల కృషి ఎంతో ఉంటుంది కనుకే తల్లిదండ్రుల తర్వాత స్థానం వారికి దక్కిందని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలు కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ముందుండాలని సూచించారు. విద్యార్థులు చదువులోనేకాదు అన్ని రంగాల్లో రాణించేలా టీచర్లు కృషి చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ట్రస్మా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సుమారు 200మందిని ఉత్తమ గురువులుగా గుర్తించి సన్మానించినట్లు కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ట్రస్మా జిల్లా బాధ్యులు పల్లె రాజురెడ్డి, శంకర్రావు, చిలుక కిరణ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.