చందుర్తి, ఆగస్టు13: తాము పోలీసులమని నమ్మిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట నేరగాళ్లను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం చందుర్తి సరిల్ కార్యాలయంలో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు విలేకరులతో వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మోతె మండలానికి చెందిన కీలుకాని సాయిచంద్, సూర్యాపేటకు చెందిన కటూరి శరత్ కుమార్ హైదరాబాద్‌లోని మీర్‌పేటలో నివాసం ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గూగుల్, టెలీగ్రామ్ ద్వారా మీ సేవ కేంద్రాలు, మనీ ట్రాన్జాక్షన్ సెంటర్ల నిర్వాహకుల ఫోన్ నంబర్లను సేకరించేవారు.
వారికి ఫోన్ చేసి పోలీసు అధికారులుగా పరిచయం చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు నేరుగా తీసుకోకుండా, వారి యూపీఐ ఐడీలు వాడకుండా ఇతరుల నంబర్లకు డబ్బులు సెండ్ చేయించుకుని, వారి వద్దకు వెళ్లి తీసుకునేవారు. ఇలాగే ఓ పెట్రోల్ బంక్ సిబ్బందిని కలిసి బోరు బండి రిపేర్ కోసం తమ యజమాని డబ్బులు పంపిస్తారని, అవి మాకు నగదు రూపంలో ఇవ్వాలని కోరి వారి నంబర్లు తీసుకొని బాధితులకు పంపించారు.
బాధితులు ఆన్లైన్లో డబ్బులు పంపించగానే వారి వద్దకు వెళ్లి నగదు తీసుకునేవారు. ఇటీవల చందుర్తికి చెందిన చిలుక పెంటయ్యకు ఫోన్ చేసి ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిగా పరిచయం చేసుకున్నారు. తన కొడుకు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నాడని, అత్యవసరంగా రూ.70 వేలు అవసరమని నమ్మించారు. నిందితులు ఇచ్చిన పెట్రోల్ బంక్ సిబ్బంది నంబర్‌కు బాధితుడు రూ.70 వేలు బదిలీ చేసిన వెంటనే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు.
దీంతో పెంటయ్య మోసపోయానని గుర్తించి చందుర్తి ఠాణాను ఆశ్రయించాడు. పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.18 వేల నగదు, సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 28కి పైగా కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు రూ.15 లక్షల మేర మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కేసు చేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ రవీందర్, ఎస్ఐ రమేశ్, ఆర్ఎస్సై జునైద్, సిబ్బంది అనిల్, గంగారెడ్డిని డీఎస్పీ అభినందించారు