ముకరంపుర, జూన్ 25: ‘ఉడుమే కదా అని పట్టి విక్రయిస్తే చర్యలు తప్పవు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అరెస్ట్ తప్పదని’ ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. మంగళవారం ఉడుములను అక్రమంగా బంధించి విక్రయించే ముఠా గుట్టు రట్టు చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి సీహెచ్ బాలామణి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం బావుపేటలోని తమిళకాలనీలో ఉడుములను బంధించి ఉంచారనే విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ అధికారుల బృందం కాలనీలో సోదాలు చేపట్టింది.
కాలనీకి చెందిన కోట రాజయ్య ఇంటి పకనే బంధించి ఉంచిన ఐదు ఉడుములను గుర్తించి విచారించారు. ఇదే కాలనీకి చెందిన కోట గొల్లయ్య, ధనవేని జంపయ్య, కోట రాజయ్య అనే ముగ్గురు కలిసి గుట్టల ప్రాంతం నుంచి ఉడుములను పట్టుకువచ్చి విక్రయించేందుకు వాటిని బంధించి ఉంచారని తెలిపారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ముగ్గురిని అదుపులోకి తీసుకుని, ఐదు ఉడుములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎఫ్వో తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఉడుములను అటవీ ప్రాంతంలో వదలి పెట్టనున్నట్లు చెప్పారు. సోదాల్లో ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఎఫ్ఆర్వో నరసింగ రావు, ఎఫ్ఎస్వో శేఖర్, ఎఫ్బీవో అజీమ్, సిబ్బంది సర్వర్ ఉన్నారు.