Collector Koya Sri Harsha | పెద్దపల్లి, సెప్టెంబర్ 12 : పెద్దపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం స్థానిక అదనపు కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి కలెక్టర్ స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వాహణపై సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతీ రోజూ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులలోని బాలికలందరికీ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పిల్లలకు అవసరమైన ఇమ్యునైజేషన్ డోసులు సకాలంలో అందించాలని, మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ వాణి శ్రీ, డీఈవో మాధవి, జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.