కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాయకుల మధ్య అంతర్గత పోరుతో ‘హస్తం’ పార్టీ అపసోపాలు పడుతున్న విషయం తెలిసిందే. వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతుండగా, పలు నియోజకవర్గాల్లో బహిర్గత మవుతున్నది. తాజాగా చొప్పదండి నియోజకవర్గంలో విభేదాలు బయటపడడం ఆ పార్టీలో హాట్ టాపిక్లా మారింది. అంతేకాకుండా ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా సొంత పార్టీ నాయకున్నే పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ తాకింది. పంచాయతీ భవన నిర్మాణానికి ముగ్గు పోసేందుకు వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేయడం, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులకు మధ్య వివాదం తలెత్తడం, పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వంటివి ఆ పార్టీకి చేదు అనుభవాన్ని చేకూర్చుతున్నాయి. ఈ రెండు ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఒకేసారి జరగడం పార్టీ శ్రేణులను అంతర్మథనంలో పడేస్తున్నాయి.
సాధారణంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక మండలం లేదా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తే.. ఆ గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రతిపక్ష పార్టీల నాయకులను అదుపులోకి తీసుకోవడం తరుచుగా జరిగే ప్రక్రియ. కానీ, శుక్రవారం బోయినపల్లి మండలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో సొంత పార్టీ అందులోనూ బీసీసెల్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.
వేములవాడ, ఆగస్టు 22 : అధికార పార్టీ చొ ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బోయినపల్లి మండలంలో పర్యటించారు. ఈ పర్యటనను పురస్కరించుకొని అదే మండలానికిచెందిన కాంగ్రెస్ బీసీ సెల్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కారణాలు చెప్పకుండానే.. పై అధికారుల ఆదేశాల మేరకు అంటూ వేములవాడ రూరల్ ఎస్ఐ అంజయ్య అదుపులోకి తీసుకోవడం ఆ పార్టీలో కలకలం రేపింది. బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామ పరిధిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నంది కమాన్ నుంచి వేములవాడ తిప్పాపూర్ మీదుగా తిప్పారు. మండలంలో ఎమ్మెల్యే పర్యటన ముగిసేంత వరకూ తిప్పి, ప ర్యటన ముగిసిన అనంతరం రవీందర్‌ను తీసుకెళ్లి ఇంటి వద్ద వదిలి పెట్టారు. ప్రస్తుతం ఈ వ్య వహారం చర్చనీయాంశమైంది. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారంటే.. ప్రతిపక్ష పార్టీ నాయకులెవరు గొడవలు చేయకుండా ఉండేందుకు ముందస్తుగా సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం రివాజు. ఇది చాలాచోట్ల సాధారణంగా జరిగే ప్రక్రియనే. అది కూడా గొడవలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం వస్తేనే అదుపులోకి తీసుకొని, కార్యక్రమం పూర్తయిన తర్వాతది వదలి పెడుతారు. కానీ, ఇక్కడ అధికార పార్టీ నాయకుడు, అందులోనూ ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంపై పార్టీలో భిన్న రకాలుగా చర్చ జరుగుతున్నది.
నిజానికి వీరిద్దరి మధ్య కొన్ని విషయాల్లో అంతర్గతపోరు నడుస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బోయినపల్లి మండలానికి సంబంధించిన ఒక పోలీస్ అధికారి వ్యవహారంలో అవి ముదిరి పాకాన పడినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో వాదనలు, ప్రతివాదనలు, సదరు పోలీస్ వ్యవహరించిన తీరు, అవినీతి అక్రమాల వంటి వాటిలో ఇరువురి మధ్య వివాదం నెలకొన్నట్టు సమాచారం. ఈ విషయంలో.. ఒకరిపై ఒకరు నేరుగా జిల్లా, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సైతం ఫిర్యాదులు చేసుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ క్రమంలో కూస రవీందర్ వ్యవహారశైలిపై కొంత మంది కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే అనుచిత పదజాలం వాడినట్టు తెలుస్తున్నది. ఆ విషయం తెలిసిన రవీందర్ మరోసారి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఎమ్మెల్యేతో మాట్లాడుతామని సదరు నాయకులు చెప్పగా.. ‘మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మా మండలానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు నేనే తేల్చుకుంటాను’ అంటూ అధిష్టానం వద్ద రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ప్రశ్నించేందుకు రవీందర్ సిద్ధమైనట్టు పార్టీవర్గాల ద్వారా సమాచారం ఎమ్మెల్యేకు తెలిసింది. దీంతో ఆయన కూడా సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారని తెలుస్తున్నది. అయితే అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆగ్రహంతో ఉన్న కూస రవీందర్.. ‘పర్యటనకు రండి. అక్కడే మాట్లాడుకుందాం’ అని చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ వివాదం చిలికి చిలికి పెద్దగా అవుతుందని భావించిన పోలీసులు.. పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వచ్చిన ఆదేశాలతో కూస రవీందర్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. పోలీస్ అధికారి వ్యవహారంలో ముదిరిన వివాదంతో సదరు అధికారి ఇప్పటికే సెలవుపై వెళ్లినా.. ఇరువురి మధ్య వివాదం సాగుతున్నట్టు తాజా సంఘటనను బట్టి అర్థమవుతున్నది. మొత్తంగా సొంత పార్టీ నాయకున్నే పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం పార్టీలో హాట్ టాఫిక్లా మారగా, కార్యకర్తలు, నాయకులు అయోమయంలో పడ్డారు. ఈ విషయంపై కూస రవీందర్ మాట్లాడుతూ.. అధికార పార్టీయే అధికార పార్టీ నాయకున్ని అదుపులోకి తీసుకునేలా చేయడం ఏంటని మీడియాతో అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తిమ్మాపూర్, ఆగస్టు 22 : మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తాకింది. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు వెళ్లిన ఆయనకు గ్రామస్తులు ఘెరావ్ చేయడంతో చేదు అనుభవం ఎదురైంది. తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఈ గ్రా మంతోపాటు పక్కనే ఉన్న సాయబ్పల్లిని కలిపి పంచాయతీగా మార్చింది. ఇటీవల ఆ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పంచాయతీ భవనాన్ని సాయబ్పల్లిలో నిర్మించేందుకు నిర్ణయించారు. దీనిని బాలయ్యపల్లివాసులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అయితే, రెండు గ్రామాల మధ్య ఏర్పాటు చేయాలి, లేదంటే బాలయ్యపల్లిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పలుసార్లు తహసీల్దార్, అధికారులకు సైతం వినతిపత్రం అందజేశారు. గతంలో నల్లగొండలో ఉన్నప్పుడు తరచూ రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లేవాళ్లమని, ఇప్పడు మళ్లీ సొంత పంచాయతీ అయినా తిరిగాల్సి వస్తుందని వా పోయారు.
అయినా, ప్రజాభీష్టాన్ని వదిలి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే సాయబ్పల్లిలో జీపీ భవనానికి ముగ్గు పోస్తుండగానే బాలయ్యపల్లివాసులు అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ఈ క్రమంలో మండల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే వెళ్తుండగా, ఆయనకు కారుకు అడ్డంగా ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు వారించగా స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహనం దిగి సీరియస్ కాగా, మరింత ఉద్రిక్తత చోటు చేసుకున్నది. తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను ఓ నాయకుడి కారులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులపై చేయి చేసుకున్నట్టు సమాచారం కాగా, అరగంటసేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ ఆరుగురు గ్రామస్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు.