వెల్గటూర్, ఫిబ్రవరి 21: వెల్గటూర్, ఎండపల్లి మండలాల్లోని రాజారాంపల్లి, ఎండపల్లి, కొత్తపే ట, అంబారిపేట, పైడిపల్లి, సంకేనపల్లి, కిషన్రావుపేట, కప్పారావుపేట, ముత్తునూర్, రాంనూర్, చెగ్యాం, శాఖాపూర, రాజక్కపల్లి గ్రామాలకు యే టా యాసంగి పంటలకు నీరందక ఎండిపోయేవి. దీంతో ఆయా గ్రామాల రైతులు అష్టకష్టాలు పడేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాళేశ్వరంలోని నంది రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు లింక్ కాలువ నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ద్వారా రూ. 12.40 కోట్లు మంజూరు చేయించారు. వెంటనే టెండర్లు పిలిచి ప్రారంభించిన పనులు వేగంగా సాగుతున్నాయి.
అయితే ఈ కాలువ పూర్తయితే తనకు రాజకీయంగా పుట్టగతులుండవని భా వించి కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సోమవారం పెద్దపల్లి కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పనులను నిలిపివేయించాలని పేర్కొన్నారు. దీంతో లింక్ కాలువ ద్వారా లబ్ధిపొందే 13 గ్రామాల రైతులు అడ్లూరి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన తీరును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. మా పొలాలకు నీరందితే నీకు వచ్చిన బాధేంటని నిలదీశారు. ఆయన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వారంతా వెల్గటూర్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అడ్లూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓట్ల కోసం గ్రామాలకు వస్తే తరిమికొడతామని హెచ్చరించారు.
ఓర్వలేకే ఫిర్యాదు జేసిండు
మాది చెగ్యాం. ఎస్సారెస్పీ కాలువ చివరి గ్రామం. పంటలకు నీరందక మస్తేండ్ల సంది గోస పడుతున్నం. మా బాధను చూసి మంత్రి మేడారం చెరువు నుంచి లింక్ కెనాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించిండు. పనులు సాగుతుంటే సంబురపడుతున్నం. కానీ అడ్లూరి ఫిర్యాదు చేయడం బాధాకరం.
– రామిళ్ల సునీల్, యువ రైతు (చెగ్యాం)
మా గ్రామాల్లో తిరగనివ్వం
ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే పనులు చేస్తుంటే అడ్లూరి లక్ష్మణ్ ఆపాలని చూస్తుండు. కొందరిని ఎగేసుకొని పోయి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిండు. ఇది మంచి పద్ధతిగాదు. నీళ్లులేక ఇన్నేండ్లు అరిగోస పడ్డం. ఇప్పుడు కాలువ పనులకు అడ్డంపడుడు ఎందుకు. ఆయన్ను మా గ్రామాల్లో తిరగనివ్వం. ఓట్ల కోసం అత్తె తిరుగబడతం.
– పందిల్ల రాజిరెడ్డి, రైతు (మారేడుపల్లి)
పనులు ఆపుడు మంచిదిగాదు..
కాంగ్రెస్ పాలనల కరెంట్ లేక, కాలువ నీళ్లు రాక మస్తు తిప్పలు పడ్డం. యేటా ఒక్క పంటే పండించేది. ఇందుకోసం తూ ముల వద్ద కాపల కాసేది. అలాంటి మా కష్టాలను అర్థ చేసుకుని రెండు పంటలకు సాగునీరందించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సార్ కాలువ తవ్విస్తున్నడు. కానీ కాంగ్రెస్ నాయకులు ఆపాలని ఫిర్యాదు చేయడం మంచిదిగాదు.
– కుమ్మరి వెంకటేశ్, రైతు (కిషన్రావుపేట)