కూరగాయల అంగడి తెలుసు.. ఎడ్లు, మేకల సంతలూ తెలుసు.. కానీ, ఇది వాహనాల వారసంత! వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం! మెట్పల్లి పట్టణంలో ఓ ఇద్దరు మిత్రులు కలిసి ఓ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టి, కూరగాయలు, ఎడ్లు, మేకల వారసంతల తరహాలో వాహనాల అమ్మకాలు, కొనుగోలుకు ప్రతి మంగళవారం అంగడి ఏర్పాటు చేస్తుండగా, అనూహ్య స్పందన వస్తున్నది.
– మెట్పల్లి, సెప్టెంబర్ 13
మెట్పల్లి పట్టణంలోని నరేంద్ర డిగ్రీ కళాశాల పక్కన, 63వ జాతీయ రహదారి వెంట వాహనాల వారసంతను మొదటిసారి ఈ నెల 6న మంగళవారం ప్రారంభించారు. రెండోసారి నిన్న (ఈ నెల 13న) నిర్వహించారు. ఈ అంగడిలో పట్టణానికి చెందిన నిర్వాహకులు పుల్ల శ్రీనివాస్ గౌడ్, పొన్న శ్రీనివాస్ గౌడ్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల వాహనాలు ఒకే చోటా లభిస్తుండగా, వాహనం కొనుగోలు చేసే, లేదా విక్రయించే అవకాశమున్నది. ఈ మార్కెట్‌కు మెట్పల్లి పట్టణ పరిసర ప్రాంతాలే కాకుండా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వినియోగదారులు, విక్రయదారులు తరలివస్తున్నారు. తమకు అవసరమైన వాహనాల కొనుగోలుకు, అదే విధంగా మరికొందరు తమ వాహనాల అమ్మకానికి ఇక్కడికి వస్తున్నారు. కొనుగోలుదారు, అమ్మకందారు ముఖాముఖిగా మాట్లాడుకొని ధర నిర్ణయించకుంటుండగా, అందుకు గాను నిర్ణీత ఫీజు (కమీషన్)ను వాహనం అమ్మకందారు, కొనుగోలుదారుల నుంచి నిర్వాహకులు తీసుకుంటారు. ద్విచక్ర వాహనానికి 500, పెద్ద వాహనాలకు వెయ్యి చొప్పున ఇద్దరి నుంచి కమీషన్ తీసుకుంటున్నారు. కాగా, పోయిన మంగళవారం ఈ అంగడికి 22 వాహనాలు రాగా, ఒక కారు, ఒక బైక్ అమ్మారు. ఈ మంగళవారం 18 వాహనాలు రాగా, మూడు బైక్‌లను విక్రయించారు.
మంచి స్పందన వస్తుంది
ఒకే చోట అన్ని రకాల వాహనాల క్రయ, విక్రయాలు జరిపేందుకు అవకాశం కల్పించాలనే ఆలోచనతో పాత వాహనాల అంగడి ప్రారంభించాం. ప్రతి మంగళవారం ఈ అంగడిని నిర్వహిస్తున్నాం. అనతికాలంలోనే ఈ వినూత్నమైన అంగడికి విస్త్రృత ప్రచారంతో వివిధ జిల్లాల నుంచి వాహనాలు విక్రయించేందుకు, కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. అంగడికి వచ్చే పాత వాహనాల క్రయ, విక్రయదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాం.
-పుల్ల శ్రీనివాస్‌గౌడ్, నిర్వాహకుడు
దళారులతో పనిలేదు
మాది ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామం. మెట్పల్లిలో పాత వాహనాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి అంగడి నిర్వహిస్తున్నట్లు తెలుసుకొని ఇక్కడికి వచ్చిన. నాకు నచ్చి న బైక్‌ను 42 వేలుకు కొన్న. అందుకు అంగడి నిర్వాహకులకు 500 ఫీజు కట్టిన. అదే బయట అయితే పాత వాహనం కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా దళారులు, బ్రోకర్లను సంపద్రించాల్సిందే. ఇక్కడైతే అలాంటి అవసరముండదు. నేరుగా విక్రయదారుడితో మాట్లాడుకోవచ్చు. నచ్చితే కొనుకోవచ్చు.
– ప్రవీణ్, వాహనం కొనుగోలుదారు