గంగాధర, నవంబర్ 30 : వరికి బదులుగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజు సూచించారు. మండలంలోని గర్శకుర్తి, ఉప్పరమల్యాల, ఇస్లాంపూర్ గ్రామాల్లో పంట మార్పిడి విధానంపై మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. నూనె గింజలు, పప్పు దినుసులు, కూరగాయలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పంట మార్పిడి చేయడంతో భూమి సారవంతంగా తయారై అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన
కాట్నపల్లిలో రైతులకు పంటమార్పిడి విధానం, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయాధికారి వంశీకృష్ణ అవగాహన కల్పించారు. పంటమార్పిడి విధానంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలపై దృష్టిసారించాలి
మండలంలోని అన్ని గ్రామాల రైతులు యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ సూచించారు. మండలంలోని వెలిచాల రైతువేదికతో పాటు గుండి, మోతె వెంకట్రావుపల్లి, దేశరాజ్పల్లి గ్రామాల్లో మంగళవారం రైతులకు యాసంగిలో పంటమార్పిడిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వెలిచాల రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ఏవో యాస్మిన్ మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులుగా నువ్వులు, వేరుశనగ, మినుము, పెసర, శనగ పంటలను సాగు చేసుకోవాలన్నారు. అధికారుల సూచనలు పాటించి రైస్ మిల్లర్లు, వితనోత్పత్తి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని వరి సాగు చేసుకోవాలని తెలిపారు. ఏఈవోలు జీ సంపత్, కే మౌనిక, జీ రాజేశ్, టీ సంపత్, రైతులు పాల్గొన్నారు.