ఒకటా రెండా.. ఒకే సారి వందలాది లారీలు ఆ గ్రామాలను చుట్టుముడుతున్నాయి. హారన్ల మోతలతో హడలెత్తిస్తున్నాయి. లారీలు వెళ్లినపుడల్లా వైబ్రేషన్ వచ్చి రోడ్ల పక్క ఇండ్లు వణికిపోతున్నాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రోడ్లు ఛిద్రమైపోతున్నాయి. మానకొండూర్ మండలం ఊటూరు, పచ్చునూర్, లలితాపూర్, అన్నారం, మానకొండూర్ గ్రామాల్లో నిత్యం కనిపిస్తున్న పరిస్థితి ఇది. ఊటూరు శివారులోని మానేరు వాగు నుంచి ప్రతి రోజు భారీ మొత్తంలో ఇసుకను తరలిస్తున్న వందలాది లారీలతో ఆయా గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తమ కోసం వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ)/ మానకొండూర్ రూరల్ : మానకొండూర్ మండలం ఊటూరు శివారులో మూడు ఇసుక క్యారీలను టీజీ ఎండీసీ గుర్తించింది. ఇక్కడ మొత్తం మూడు క్వారీలను నిర్వహిస్తున్నారు. ఊటూరు విలేజ్-1 పరిధిలోని బ్లాక్-1, బ్లాక్-2 పేరిట ఒక చోట, ఊటూరు విలేజ్-2 పేరిట మరో క్వారీని అధికారికంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఊటూరు విలేజ్-1లోని బ్లాక్-1లో, ఊటూరు విలేజ్ -2 పరిధిలో ఇప్పటికే ఇసుక నిలువలు నిండుకున్నాయి. ప్రస్తుతం బ్లాక్-2లో మాత్రమే ఇసుక నిలువలు ఉన్నాయి.
ఇక్కడి ఇసుక కోసం నిత్యం వందలాది లారీలు హైదరాబాద్ దాని చుట్టుపక్కల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. లారీలు ఇసుక క్వారీలకు వెళ్లేందుకు గ్రామం చుట్టూ పంట పొలాల నుంచి మట్టి రోడ్లను నిర్మించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. నిత్యం వందలాది లారీలు నడవడం వల్ల రోడ్లు ఛిద్రమై పోతున్నాయి. మానకొండూర్ నుంచి మొదలుకుంటే ఊటూరు వరకు 16 కిలో మీటర్ల మేర ఎక్కడ చూసినా అడుగడుగునా ఇసుక లారీలే తారస పడుతుంటాయి. రోడ్లపై రొద పెడుతూ పరుగులు తీయడమో, రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేసి పెట్టడమో జరుగుతోంది. దీంతో స్థానిక ప్రజలు రోడ్లపై ప్రయాణించాలంటే జంకి పోతున్నారు.
రోజుకు 200 లారీలపైనే..
ఊటూరు గ్రామం నుంచి రోజుకు సుమారు 200 లారీలపైనే ఇసుకను తరలిస్తున్నాయి. వాగు నుంచి టిప్పర్ల ద్వారా బయటికి తెచ్చి ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీలను యంత్రాలతో నింపుతూ తరలిస్తున్నారు. 14 నుంచి 16 టైర్ల లారీల ద్వారా ఇసుకను హైదరాబాద్ దాని చుట్టు పక్కల ప్రాంతానికి తరలిస్తున్నారు. 14 టైర్ల లారీలో అయితే 32 మెట్రిక్ టన్నులు, 16 టైర్ల లారీలో అయితే 35 మెట్రిక్ టన్నుల ఇసుక లోడ్ చేస్తున్నట్లు టీజీ ఎండీసీ అధికారులు చెబుతున్నారు. నిజానికి ఇక్కడ వేయింగ్ చేసేందుకు వే బ్రిడ్జి ఉన్నా పని చేయడం లేదు. లారీలో ఓవర్ లోడ్ వేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నామ మాత్రానికి ఇటీవలనే వే బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఛిద్రమై పోతున్న గ్రామీణ రోడ్లు
కరీంనగర్ జిల్లా కేంద్రానికి 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఊటూరు గ్రామాన్ని ఆనుకుని మానేరు వాగు ప్రవహిస్తున్నది. ఊరు చుట్టూ తిరుగుతూ ఈ వాగు వెళ్తుంది. కరీంనగర్ శివారులోని అల్గునూర్ మీదుగా మానకొండూర్ వరకు వరంగల్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఇసుక లారీలు అక్కడి నుంచి మానకొండూర్ నుంచి జమ్మికుంట వరకు ఉన్న డబుల్ రోడ్డుపై పచ్చునూర్ వరకు ప్రయాణిస్తాయి. అక్కడి నుంచి 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఊటూరుకు వేసిన సింగిల్ రోడ్డుపై ప్రయాణిస్తాయి. ఇసుక లారీల కారణంగా ఈ దారులన్నీ ఛిద్రమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా మానకొండూర్ నుంచి జమ్మికుంటకు వెళ్లే ప్రధాన దారిని ఇటీవలే నిర్మించారు.
ఈ రోడ్డు ఇసుక లారీలు ఓవర్‌లోడ్‌తో ప్రయాణించడం వల్ల ఇప్పటికే అక్కడక్కడ గుంతలు ఏర్పడ్డాయి. కొత్తగా వేసిన ఈ రోడ్డుకు ఇంకా కొన్ని చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. ఇలాంటి చోట్లనైతే రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. మోకాలు మంటి గుంతలు ఏర్పడ్డాయి. మానకొండూర్ మండల కేంద్రానికి సమీపంలో అన్నారం, పచ్చునూర్ వద్ద ఇలా రోడ్డు ఛిద్రమైన ప్రదేశాలు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాలువపై నిర్మించిన చిన్న చిన్న కల్వర్టులు కూడా దెబ్బతింటున్నాయి. ఇక పచ్చునూర్ నుంచి ఊటూరు వెళ్లే దారిలో రెండు నెలల కిందనే రోడ్డు నిర్మించారు. బీటీతో నిర్మించిన ఈ రోడ్డు మట్టి రోడ్డుగా దర్శనమిస్తోంది. లారీలు ఎదురెదురుగా వచ్చినపుడు రోడ్డుకు ఇరువైపులా భారీ గుంతలుపడి ప్రమాదకరంగా మారాయి.
లారీల చక్రబంధనంలో గ్రామాలు
ఊటూరు నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఇసుక తరలించేందుకు ప్రతి రోజు వందలాది లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. మానకొండూర్ మండలం అన్నారం మొదలు కొని పచ్చునూర్ వరకు ఉన్న డబుల్ రోడ్డుపై దారికి ఇరువైపులా ఎక్కడ బడితే అక్కడ విచ్చల విడిగా పార్కింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా స్థానిక గ్రామాల ప్రజలు, కరీంనగర్ నుంచి జమ్మికుంటకు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితిలో ఉన్న చిన్న కల్వర్టులపై ఇసుక లారీలు వెళ్లిపోయే వరకు ఇతర వాహనాల మరోవైపు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
మరో పక్క పదుల సంఖ్యలో ఇసుక లారీలు ఒకేసారి భారీ ఇసుక లోడ్‌తో వస్తుంటే ఊటూరు, పచ్చునూర్, లలితాపూర్, అన్నారం, మానకొండూర్ గ్రామాల్లో రోడ్డు పక్కనున్న ఇండ్ల వారికి నిద్ర కరువవుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా భారీ వాహనాల హారన్లతో గ్రామాలు హోరెత్తి పోతున్నాయి. ఊటూరు నుంచి ప్రధాన రహదారికి రావాలంటే ఇండ్ల మధ్య నుంచి లారీలు వెళ్లాల్సి ఉంటుంది. లారీలు వస్తున్న క్రమంలో తమ ఇండ్లు వైబ్రేషన్‌కు గురవుతున్నాయిని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అంతే కాకుండా దుమ్ముతో తమ ఇండ్లన్నీ నిండి పోతున్నాయని, రాత్రి వేళ హారన్లతో నిద్రకు దూరమవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.